పిల్ల‌ల‌కు వ్యాక్సిన్లు ఇప్పుడివ్వ‌లేం.. పొంచి ఉన్న మూడో ముప్పు

  • Written By:
  • Updated On - March 1, 2022 / 01:13 PM IST

క‌రోనా మూడో వేవ్ చిన్న పిల్ల‌ల‌కు వ‌స్తుంద‌ని నిపుణులు అంచనా వేశారు. ప్ర‌స్తుతం క‌రోనా ఛాయ‌లు త‌గ్గిపోవ‌డంతో స్కూల్స్ ను ప్రారంభించారు. అడ్మిష‌న్స్ దాదాపుగా తెలంగాణ‌, ఏపీల్లో పూర్త‌య్యాయి. క‌రోనా పొంచి ఉంద‌ని తాజాగా సీరం ఇనిస్టిట్యూట్ చెబుతోంది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి లేదా ఫిబ్ర‌వ‌రి నెల‌కు పిల్ల‌ల‌కు వ్యాక్సిన్లు సిద్ధం అవుతాయ‌ని వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం వ్యాక్సిన్ల ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్నాయ‌ని ఇనిస్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అద‌ర్ పూనావాలె వివ‌రించారు. ప‌లువురు వాలంటీర్లు ఇచ్చిన స‌మాచారం ప్ర‌కారం వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ విజ‌య‌వంతంగా న‌డుస్తున్నాయ‌ని వాలె ప్ర‌క‌టించారు. క‌నీసం మూడు నాలుగు నెలల త‌రువాతగానీ స్ప‌ష్ట‌త వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ని చెబుతున్నారు. 12ఏళ్ల లోపు పిల్ల‌ల‌కు వ్యాక్సిన్లను సిద్ధం చేయ‌డానికి ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్నాయ‌ని తాజాగా వెల్ల‌డించారు.
సీర‌మ్ ఇనిస్టిట్యూట్ క‌రోనాపై ఆందోళ‌న చెందుతుంటే, పిల్ల‌ల ప్రాణాల‌ను ప్ర‌భుత్వాలు ప‌ణంగా పెడుతున్నాయి. స్కూల్స్, కాలేజీల అడ్మిష‌న్ల కోసం ప్ర‌భుత్వాలు అనుమ‌తులు ఇచ్చేశాయి. పైగా ఎలాంటి జాగ్ర‌త్త‌ల‌ను యాజ‌మాన్యాలు పాటించ‌డంలేదు.అడ్మిష‌న్స్ పూర్తిగా ముగిసేనాటికి క‌రోనా మూడో వేవ్ ఉధృతి ఉంటుంద‌ని నిపుణులు భావిస్తున్నారు. ఆ లోపుగా అడ్మిష‌న్ల రూపంలో యాజ‌మాన్యాలు కొన్ని కోట్ల రూపాయ‌లు ఫీజుల రూపంలో వ‌సూలు చేసుకుంటాయి. ప్ర‌భుత్వాల‌ను జీఎస్టీ రూపంలో నిధులు స‌మ‌కూరుతాయి. క‌రోనా పిల్ల‌ల‌కు సోకితే, కంట్రోలు చేయ‌డానికి వ్య‌వ‌స్థ లేద‌ని నిపుణులు ఆందోళ‌న చెందుతున్నారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వాలు వివిధ రూపాల‌లో ప‌న్నుల వ‌సూలు కోసం పిల్ల‌ల ఆరోగ్యాన్ని లెక్క‌చేయ‌లేదు. ఒక వేళ క‌రోనా మూడో వేవ్ కంట్రోల్ చేయ‌లేక‌పోతే, బాధ్య‌త ఎవ‌రు వహించాలి. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వాలు క‌ళ్లు తెర‌వ‌క‌పోతే జ‌రిగే న‌ష్టం ఊహించ‌లేం.