Maredumilli encounter : మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ ఘటనపై సీపీఐ (మావోయిస్టు) పార్టీ కేంద్ర కమిటీ ఒక వివాదాస్పద ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో ఆ సంఘటన అసలు ఎన్‌కౌంటర్ (Encounter) కాదని, పూర్తిగా బూటకపు ఘటనగా పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేసింది. తమ కీలక నేతలను నిరాయుధ స్థితిలో పోలీసులే అదుపులోకి తీసుకొని హత్య చేశారని మావోయిస్టుల వాదన. అయితే, ఈ ఆరోపణలపై అధికార యంత్రాంగం నుంచి అధికారిక ప్రతిస్పందన ఇంకా వెలువడలేదు. కేంద్ర కమిటీ పేరు మీద ‘అభయ్’ విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం, కమిటీ సభ్యుడు మడ్వి హిడ్మా, ఆయన సహచరి రాజే, మరికొందరు సహచరులతో కలిసి వైద్య చికిత్స కోసం విజయవాడకు వెళ్లారట. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే, కొందరి ద్రోహం కారణంగా వారి వివరాలు పోలీసులకి చేరాయని ఆరోపించారు. ఈ సమాచారంతో నవంబర్ 15న కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) అధికారులు హిడ్మా, రాజేలను అదుపులోకి తీసుకున్నట్లు లేఖ పేర్కొంది.
GST : జీఎస్టీ తగ్గించినా ధరలు తగ్గకపొవడానికి కారణాలివే..!
మావోయిస్టు ప్రకటన ప్రకారం, అదుపులోకి తీసుకున్న తరువాత లొంగిపోవాలని ఒత్తిడి చేయగా వారు అంగీకరించలేదని, దీంతో వారిని హింసాత్మకంగా హత్య చేసి, తర్వాత ఈ మరణాలను మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారని ఆరోపించారు. ఇదే తరహాలో రంపచోడవరంలో ఏవోబీ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించిన శంకర్‌ను కూడా పోలీసులు చంపి, దానిని ఎన్‌కౌంటర్‌గా చూపించారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలు పూర్తిగా మావోయిస్టుల వాదన మాత్రమే స్వతంత్రంగా నిర్ధారించబడినవి కావు. కేంద్ర కమిటీ ప్రకటనలో ఈ సంఘటనలను తీవ్రంగా ఖండిస్తూ నవంబర్ 23న దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని పిలుపునిచ్చింది. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం పోలీసులు ఇలా ఎన్‌కౌంటర్ల పేరుతో హత్యలకు పాల్పడుతోందని ఆరోపించింది.
Tejas Fighter Jet Accident : దుబాయ్ ఎయిర్‌షోలో భారత ‘తేజస్’ యుద్ధవిమానం కూలింది; పైలట్ స్థితిపై స్పష్టత లేదు
ఈ మరణాల్లో హిడ్మా, రాజే, శంకర్‌తో పాటు మరికొందరు నష్టపోయారని, వారికి విప్లవ జోహార్లు అర్పిస్తున్నట్లు తెలిపింది. వారి స్ఫూర్తితో తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని పేర్కొంది. ప్రెస్ నోట్ మొత్తాన్ని పరిశీలిస్తే, మారేడుమిల్లి ఘటనపై పోలీసుల వెర్షన్‌కు పూర్తిగా విరుద్ధమైన కథనాన్ని మావోయిస్టు పార్టీ ముందుంచినట్లు కనిపిస్తుంది. అధికార వర్గాల నుంచి వచ్చిన వివరాలు, మావోయిస్టుల ఆరోపణలు రెండూ పరస్పరం విభిన్నంగా ఉండటంతో, నిజనిజాలు వెలుగులోకి రావాలంటే స్వతంత్ర విచారణ అవసరమని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.
