Site icon HashtagU Telugu

Maoist : మావోయిస్టు కేంద్ర కమిటీలో కీలక పరిణామం

Maoist Venugopal Rao

Maoist Venugopal Rao

మావోయిస్టు ఉద్యమంలో సంచలనాత్మక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర కమిటీలో కీలక నేతగా వ్యవహరించిన మల్లోజుల వేణుగోపాలరావు తన అనుచరులతో కలిసి మహారాష్ట్ర గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. సుమారు 60 మంది మావోయిస్టు కార్యకర్తలు కూడా ఆయనతోపాటు లొంగిపోయారు. ఈ పరిణామం మావోయిస్టు సంస్థలో తీవ్ర చర్చకు దారితీసింది. పెద్దపల్లి జిల్లాకు చెందిన వేణుగోపాలరావు గత 30 ఏళ్లుగా అరణ్యప్రాంతాల్లో సాయుధ పోరాటాన్ని నడిపిస్తూ, ఆర్గనైజేషన్‌లో ముఖ్య స్థానాన్ని సంపాదించారు. ఆయనపై 100కు పైగా కేసులు నమోదయ్యాయి, ప్రభుత్వంవారి తలపై 1 కోటి రివార్డు ప్రకటించింది.

 

Assets of Government Servant : ప్రభుత్వ ఉద్యోగి ఆస్తులు చూస్తే అవాక్కవ్వాల్సిందే..

 

గత కొన్నినెలలుగా వేణుగోపాలరావు మావోయిస్టు పార్టీ ప్రస్తుత దిశపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖలు విడుదల చేస్తున్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం, ప్రస్తుత నాయకత్వం ప్రజా సమస్యల నుండి దారి తప్పి, అంతర్గత రాజకీయాలు, అధికారం కోసం పోరాటాల్లో చిక్కుకుపోయిందని ఆరోపించారు. మావోయిస్టు ఉద్యమం తన అసలు లక్ష్యాలైన సామాజిక న్యాయం, భూసంస్కరణల దిశలో కొనసాగడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ లేఖలు మావోయిస్టు వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అంతర్గత విభేదాలు పెరగడం, భద్రతా దళాల ఒత్తిడి, వయసు, ఆరోగ్య సమస్యలు కూడా ఆయన లొంగిపోవడానికి కారణమయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు.

వేణుగోపాలరావు లొంగిపోవడం మావోయిస్టు ఉద్యమానికి భారీ దెబ్బగా పరిగణిస్తున్నారు. గడ్చిరోలి, చత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అరణ్యప్రాంతాల్లో ఆయనకు ఉన్న ప్రభావం గణనీయమైనది. ఈ పరిణామంతో మావోయిస్టు కేడర్‌లో నిరుత్సాహం వ్యాపించే అవకాశం ఉందని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు, మహారాష్ట్ర పోలీసులు, కేంద్ర గృహ మంత్రిత్వశాఖ ఈ లొంగుబాటును మావోయిస్టు నిర్మూలనలో కీలక మలుపుగా చూస్తున్నారు. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈ పరిణామం ద్వారా భవిష్యత్తులో మరికొందరు అగ్రనేతలు కూడా ప్రధాన స్రవంతిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version