Hijab: హిజాబ్ విచారణను నిరాకరించిన సుప్రీం…సంచలనం చేయోద్దన్నచీఫ్ జస్టిస్..!!

హిజాబ్ కేసుపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు మరోసారి నిరాకరించింది. కర్నాటక హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా ముస్లి విద్యార్థులు వేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

  • Written By:
  • Updated On - March 24, 2022 / 02:41 PM IST

హిజాబ్ కేసుపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు మరోసారి నిరాకరించింది. కర్నాటక హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా ముస్లి విద్యార్థులు వేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విద్యార్థుల తరఫు సీనియర్ అడ్వకేట్ దేవదత్ కామత్ వాదనలు వినిపిస్తూ…హైకోర్టు ఆదేశాల కారణంగా విద్యార్థులకు వార్షిక పరీక్షల్లో సమస్య ఏర్పడినట్లు సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులు పరీక్షలకు హాజరుకాలేరు..ఒక ఏడాది నష్టపోలేరు కాబట్టి సమస్య అత్యవసరం అన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ స్పందించారు. పరీక్షలకు ఈ సమస్యకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కర్నాటక హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన హిజాబ్ పిటిషన్లపై విచారణకు నిర్దిష్ట తేదీని చెప్పేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

దీనిని సంచలనం చేయవద్దని చీఫ్ జస్టిస్ సూచించారు. అంతకుముందు అప్పీల్ ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హోలీ సెలవుల తర్వాత విచారణను వాయిదా వేసింది. ఆ కేసును ఇవాళ అత్యవసర జాబితా కోసం భారత ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రస్తావించాల్సి ఉంది. విద్యార్థులకు మార్చి 28న పరీక్షలు ఉంటాయని..హిజాబ్ లేకుండా తరగతి గదిలోకి అనుమతించకపోతే…ఒక సంవత్సరం నష్టపోతారని న్యాయవాది కమాత్ కోర్టకు తెలిపారు.

ఇటీవలి తీర్పులో, హిజాబ్ తో సహా విద్యాసంస్థల్లో మతపరమైన దుస్తులపై నిషేధాన్ని కర్నాటక హైకోర్టు సమర్థించింది. ఇస్లాంలో హిజాబ్ ముఖ్యమైన మతపరమైన ఆచారం కాదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఇక హిజాబ్ తీర్పు వెలువరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితూ రాజ్ అవస్తీ, జస్టిస్ కృష్ణ దీక్షిత్, జస్టిస్ ఖాజీ ఎం జైబున్నీసాలకు బెదిరింపులు వస్తున్నాయంటూ ఫిర్యాదు అందడంతో వారందరికీ వై కేటగిరీ భద్రతను కల్పించారు. ఎలాంటి నిబంధనలు లేనందున పరీక్షలు హాజరకానీ వారికి మళ్లీ పరీక్షలు నిర్వహించడం లేదని కర్నాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్ తెలిపారు. కోర్టు తీర్పుకు తాము కట్టుబడి ఉంటామన్నారు.