Beggars Homes: దేశవ్యాప్తంగా ఉన్న బిచ్చగాళ్ల హోమ్‌లు (Beggars Homes) జైళ్ల కంటే దారుణంగా ఉన్నాయని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ హోమ్‌లను ప్రభుత్వాలు దాతృత్వ సంస్థలుగా నిర్వహిస్తున్న తీరును కోర్టు తీవ్రంగా విమర్శించింది. ఇలాంటి హోమ్‌లు వ్యక్తులకు పునరుద్ధరణ, నైపుణ్యాభివృద్ధి, సమాజంలో తిరిగి కలిసిపోయే కేంద్రాలుగా ఉండాలని స్పష్టం చేసింది. బెగ్గర్స్ హోమ్స్‌లో అధిక రద్దీ, అపరిశుభ్ర పరిస్థితులు, అనవసరమైన నిర్బంధం, వైద్య సదుపాయాలు నిరాకరించడం, మానసిక-శారీరక అవసరాలను నిర్లక్ష్యం చేయడం, వ్యక్తిగత స్వేచ్ఛపై ఆంక్షలు, జైలు లాంటి వాతావరణం వంటివి కేవలం విధానపరమైన వైఫల్యాలు మాత్రమే కాదు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవించే హక్కు) ఉల్లంఘనేనని సుప్రీంకోర్టు పేర్కొంది.
నిరుపేదలకు కూడా దక్కని ప్రాథమిక హక్కులు
దేశవ్యాప్తంగా బిచ్చగాళ్ల హోమ్‌ల నిర్వహణను మెరుగుపరచాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ ల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం నిరుపేదలు, జైలు ఖైదీలకు లభించే ప్రాథమిక రాజ్యాంగ హక్కులు కూడా బిచ్చగాళ్లు కోల్పోతున్నారు. బెగ్గర్స్ హోమ్‌లు రాజ్యాంగబద్ధమైన ట్రస్ట్‌లుగా ఉండాలని, వీటి ద్వారా అత్యంత బలహీన వర్గాల వారికి అధిక రక్షణ, గౌరవం, ఆరోగ్యం, ఆశ్రయం, గోప్యత, మానవీయ ఓదార్పు వంటి హక్కులకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని కోర్టు తెలిపింది.
Also Read: Curry Leaves: పరగడుపున కరివేపాకు తింటే కలిగే ప్రయోజనాలివే!
ముఖ్య సూచనలు- మార్గదర్శకాలు
సుప్రీంకోర్టు బెగ్గర్స్ హోమ్‌ల నిర్వహణ మెరుగుపరచడానికి కొన్ని కీలక సూచనలు చేసింది.
ఆరోగ్య పరీక్షలు: హోమ్‌లో ప్రవేశించిన 24 గంటలలోపు తప్పనిసరిగా ఆరోగ్య తనిఖీలు నిర్వహించాలి.
ఆహారం: ఆహార ప్రమాణాలను ధృవీకరించడానికి అర్హత కలిగిన డైటీషియన్ ఉండాలి.
మౌలిక సదుపాయాల సమీక్ష: కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారి భవనాలను సమీక్షించి, రద్దీ, అంటు వ్యాధుల వ్యాప్తిని నివారించాలి.
వృత్తి శిక్షణ: వ్యక్తులకు వృత్తి శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని సమాజంలో తిరిగి కలవడానికి ప్రోత్సహించాలి.
భద్రత- గోప్యత: మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక సౌకర్యాలు, గోప్యత, భద్రత, విద్య, కౌన్సిలింగ్ సేవలు అందించాలి.