Gujarat Riots : గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి సుప్రీం క్లీన్ చిట్

2002 సంవత్సరంలో గుజ‌రాత్‌లో జ‌రిగిన‌ అల్ల‌ర్ల కేసులో సిట్ గ‌తంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి క్లీన్ చిట్ ఇచ్చింది.

  • Written By:
  • Publish Date - June 24, 2022 / 11:47 AM IST

2002 సంవత్సరంలో గుజ‌రాత్‌లో జ‌రిగిన‌ అల్ల‌ర్ల కేసులో సిట్ గ‌తంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి క్లీన్ చిట్ ఇచ్చింది. క్లీన్ చిట్ ను సవాలు చేస్తూ కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ వేసిన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. జ‌స్టిస్ ఏఎం ఖాన్‌విల్క‌ర్‌, దినేశ్ మ‌హేశ్వ‌రి, సీటీ ర‌వికుమార్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ తీర్పును ఇచ్చింది. గతంలో సిట్ ఇచ్చిన తీర్పును సుప్రీం స‌మ‌ర్థించింది. సిట్ తీర్పును ఆమోదిస్తూ మెజిస్ట్రేట్ తీసుకున్న నిర్ణ‌యాన్ని తాము స‌మ‌ర్ధిస్తున్నామ‌ని, ఈ కేసులో దాఖ‌లైన నిర‌స‌న పిటిష‌న్‌ను తోసిపుచ్చుతున్న‌ట్లు సుప్రీం ధ‌ర్మాసనం వెల్లడించింది. 2021 సంవత్సరం డిసెంబ‌ర్ 8న ఈ కేసులో విచార‌ణ పూర్తయింది. అయితే సుప్రీం త‌న తీర్పును ఇవాళ వెలువ‌రించింది. గుజ‌రాత్ అల్ల‌ర్ల స‌మ‌యంలో కాంగ్రెస్ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ హ‌త్య‌కు గుర‌య్యారు. గుల్బర్గా సొసైటీ మారణకాండ లో చనిపోయిన 68 మందిలో ఆయన ఒకరు. గోద్రాలో సాధువులు వెళ్తున్న రైలు బోగీని దుండగులు దహనం చేసిన మరుసటి రోజే గుల్బర్గా సొసైటీ మారణకాండ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో సిట్ తీర్పును 2017లో గుజ‌రాత్ హైకోర్టు స‌మ‌ర్ధించింది. గుజ‌రాత్ అల్ల‌ర్ల స‌మ‌యంలో మోదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఉన్నారు. మోదీతో పాటు ఇత‌ర రాజ‌కీయ‌వేత్త‌లు, అధికారుల‌పై 2006లో జాకియా జాఫ్రీ కేసులు వేశారు.