Electoral Bonds : 2019 సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 15 వరకు 22,217 ఎలక్టోరల్ బాండ్లను జారీ చేశామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రకటించింది. వీటిలో 22,030 ఎలక్టోరల్ బాండ్లను రాజకీయ పార్టీలు రీడీమ్ చేసుకున్నాయని వెల్లడించింది. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. ఇవాళ ఎస్బీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. అందులోనే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు పొందిన విరాళాల లెక్కలను ప్రస్తావించింది. కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి కూడా బాండ్లపై డేటాను సమర్పించినట్లు కోర్టుకు ఎస్బీఐ తెలిపింది. ఈసీకి పెన్‌డ్రైవ్‌లో ఆ సమాచారాన్ని చేరవేసినట్లు పేర్కొంది. రెండు పీడీఎఫ్ ఫైళ్ల రూపంలో పాస్‌వర్డ్ ప్రొటెక్షన్‌తో రాజకీయపార్టీల విరాళాల వివరాలన్నీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చినట్లు ఎస్బీఐ తెలిపింది. ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు తేదీ, కొనుగోలుదారుల పేర్లు, విరాళాలు అందుకున్న రాజకీయ పార్టీ పేర్లు ఈసీకి సమర్పించినట్లు వెల్లడించింది.
We’re now on WhatsApp. Click to Join
రాజకీయ పార్టీలకు రూ.16వేల కోట్లు ?
ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds) జారీ ద్వారా వివిధ రాజకీయ పార్టీలకు దాదాపు 16వేల కోట్ల రూపాయల విరాళాలు సమకూరాయి. విరాళాల్లో అత్యధికంగా 80 శాతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకే వచ్చినట్లు తెలుస్తోంది. దేశంలోని పరిశ్రమలు, కంపెనీలకు సంబంధించిన విధివిధానాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం కేంద్ర సర్కారుకే ఉంటుంది. అందుకే కేంద్ర సర్కారును నడుపుతున్న బీజేపీకి ఇంతగా విరాళాలు వచ్చాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
Also Read : Group 1 Mains : 2018 గ్రూప్-1 మెయిన్స్ రద్దు.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
- ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని కేంద్రంలోని మోడీ సర్కారు 2018లో తీసుకొచ్చింది.
- దీనికింద 2018 సంవత్సరం నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 30 విడతల్లో ఎలక్టోరల్ బాండ్లను ఎస్‌బీఐ దేశంలోని వివిధ బ్రాంచీల ద్వారా దాతలకు విక్రయించింది.
- ప్రత్యేకించి ముంబై, హైదరాబాద్, ఢిల్లీలలోని బ్రాంచీలలోనే 70 శాతం బాండ్ల విక్రయాలు జరిగాయి.
- ఈ బాండ్ల విక్రయాల ద్వారా మొత్తం రూ.16,518 కోట్ల విరాళాలు వచ్చాయని అంచనా.
- అయితే వాటిని ఇచ్చింది ఎవరు ? అనేది ఇప్పటిదాకా తెలియదు. దాతల విరాళాలను దాచడం రాజ్యాంగ విరుద్ధమని ఫిబ్రవరి 15న వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు.. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలను సేకరించే పద్ధతిని రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.
- ఎన్నికల బాండ్ల ప్రక్రియ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉందని పేర్కొంటూ కాంగ్రెస్ నేత జయా ఠాకూర్, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), సీపీఎం దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది.