Jai Bajrang Bali : దూషణలే అస్త్రంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ లీడర్లకు ఓటుతో బుద్ధి చెప్పాలని.. ఓటు వేసేటప్పుడు “జై బజరంగ్ బలి” (Jai Bajrang Bali) అని నినదించాలని ఓటర్లకు ప్రధాని మోడీ సూచించారు. ఉత్తర కన్నడ జిల్లాలో బుధవారం జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నిర్మించుకున్న అవినీతి వ్యవస్థను కుప్పకూల్చాననే అక్కసుతోనే తనపై కాంగ్రెస్, దాని లీడర్లు విద్వేషపూరిత దూషణలు చేస్తున్నారని మండిపడ్డారు. “కాంగ్రెస్ హయాంలో దేశవ్యాప్తంగా 10 కోట్ల నకిలీ పేర్లను సృష్టించి వివిధ ప్రభుత్వ పథకాల డబ్బును వాళ్ళ ఖాతాలలోకి పంపారు. అక్కడి నుంచి ఆ సొమ్ము కాంగ్రెస్ లీడర్ల జేబులోకి వెళ్ళింది.
మేం గత 9 ఏళ్లలో ఆ ఫేక్ నేమ్స్ అన్నీ తొలగించాం” అని మోడీ వెల్లడించారు. “త్వరలో రిటైర్ కాబోతున్న ఒక నాయకుడిని చూపించి కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతోంది. మరో మార్గంగా నాపై దూషణలు చేస్తూ ఓట్లు అడుగుతోంది” అని ఆయన కామెంట్ చేశారు. కర్ణాటకలో ఎవరైనా ఈ దూషణల సంస్కృతిని అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. దశాబ్దాల దుష్పరిపాలన కారణంగా కాంగ్రెస్ విశ్వసనీయతను కోల్పోయిందన్నారు. ఉత్తర కన్నడ జిల్లాలో బహిరంగ సభలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని మోడీ అంకోలాలో పద్మశ్రీ గ్రహీతలు తులసి గౌడ, సుక్రి బొమ్మగౌడలను ఆప్యాయంగా పలకరించారు. సభా వేదికపైకి వెళ్లి వారికి వినయపూర్వకంగా నమస్కారం చేశారు. షేక్ హ్యాండ్ ఇచ్చి.. పద్మశ్రీ అవార్డును అందుకున్నందుకు కంగ్రాట్స్ చెప్పారు.
ఈక్రమంలో ప్రధాని మోడీ కాళ్లకు మొక్కేందుకు తులసి గౌడ యత్నించగా ఆపిన మోడీ.. మరోసారి వంగి ఆమెకు వందనం చేశారు. తులసి గౌడ, సుక్రి బొమ్మగౌడలు మోడీని ఈసందర్భంగా దీవించారు. హృదయాన్ని కదిలించే ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2021లో పర్యావరణ పరిరక్షణకు చేసిన కృషికిగానూ కర్ణాటకకు చెందిన గిరిజన మహిళ తులసి గౌడకు పద్మశ్రీ అవార్డు లభించింది. “నైటింగేల్ ఆఫ్ హలక్కీ”గా పేరుగాంచిన సుక్రి బొమ్మగౌడ 2017లో జానపద గానంలో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.
Also Read: Viral News : టెక్నాలజీని గుడ్డిగా నమ్మితే.. నేరుగా బీచ్ లోకి తీసుకెళ్లింది