China Vs India : భారత్ సరిహద్దు వెంట చైనా ఆర్మీ అక్రమ నిర్మాణాల ప్రక్రియ కొనసాగుతోంది. మన దేశంలోని తూర్పు లడఖ్ సరిహద్దుల్లో ఉండే పాంగోంగ్ సరస్సుకు సమీపంలో చైనా సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించిన శాటిలైట్ ఫొటోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఓ వైపు చర్చలకు సిద్ధం అంటూనే.. మరోవైపు సరిహద్దుల్లో చైనా ఆర్మీ అక్రమ నిర్మాణాలు చేపడుతుండటం వివాదానికి దారితీస్తోంది. చైనా ప్రస్తుతం పాంగోంగ్ సరస్సు సమీపంలో నిర్మిస్తున్న సైనిక స్థావరం అనేది.. 2020 సంవత్సరంలో భారత్-చైనా సైనికుల మధ్య పరస్పర ఘర్షణ జరిగిన ప్రాంతానికి తూర్పు వైపున 38 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాంగోంగ్ త్సో అనేది ప్రపంచంలోనే ఎత్తయిన ప్రదేశంలో ఉన్న ఉప్పునీటి సరస్సు. ఈ సరస్సు భారత్‌కు, చైనా ఆధీనంలోని టిబెట్‌కు మధ్యలో(China Vs India) ఉంటుంది. ఈ సరస్సు సరిహద్దులపై గత కొన్ని దశాబ్దాలుగా ఇరుదేశాల మధ్య వివాదం నడుస్తోంది.
Also Read :Lawrence Bishnoi : సబర్మతీ జైలులో లారెన్స్ బిష్ణోయ్.. అతడిని కస్టడీకి ఇవ్వకపోవడానికి కారణమిదే
పాంగోంగ్ సరస్సు సమీపంలో చైనా చేపడుతున్న నిర్మాణాల శాటిలైట్ ఫొటోలను ఈనెల 9వ తేదీనే అమెరికాకు చెందిన మాక్సర్ టెక్నాలజీస్ తీసింది. దాదాపు 17 హెక్టార్ల విస్తీర్ణంలో చైనా ఆర్మీ వేగవంతంగా నిర్మాణాలు చేస్తుండటం ఆ ఫొటోలలో స్పష్టంగా కనిపిస్తోంది. పాంగోంగ్ సరస్సుకు సమీపంలో 4,347 మీటర్ల ఎత్తులో యెమగౌ రోడ్ వద్ద సైనిక నిర్మాణాలను చైనా చేపడుతోంది. అక్కడ పెద్ద మొత్తంలో నిర్మాణ సామగ్రి, మట్టిని తరలించే యంత్రాలు ఉన్నట్లు ఫొటోలను బట్టి తెలుస్తోంది. ఆ ఏరియాలో దాదాపు 100 కంటే ఎక్కువ భవనాలను నిర్మిస్తున్నారని అంచనా వేస్తున్నారు. సైనికులను అక్కడికి తరలించే ఉద్దేశంతోనే చైనా ఈ నిర్మాణాలు చేపడుతోందని అంటున్నారు. నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశపు ఆగ్నేయ మూలలో 150 మీటర్ల పొడవైన దీర్ఘచతురస్రాకార స్ట్రిప్ ఉంది. హెలికాప్టర్ల ల్యాండింగ్, పార్కింగ్ కోసం ఆ స్థలాన్ని సిద్ధం చేయొచ్చని భావిస్తున్నారు.