Site icon HashtagU Telugu

Tamil Nadu Politics : అన్నాడీఎంకేలో ప‌ట్టుకోసం మ‌ళ్లీ శ‌శిక‌ళ

Sasikala

Sasikala

మాజీ సీఎం జ‌య‌ల‌లిత ప్రాణ స్నేహితురాలు మ‌రోసారి అన్నాడీఎంకే పార్టీపై ప‌ట్టు సాధించ‌డానికి ప్ర‌యత్నం చేస్తున్నారు. ఆ క్ర‌మంలో భారీ రోడ్ షోల‌ను నిర్వ‌హించ‌డం ద్వారా బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నారు. ప్ర‌స్తుతం ప‌న్నీర్, ఫ‌ళ‌నీ మ‌ధ్య ఉన్న గ్యాప్ ను అనుకూలంగా మ‌లుచుకోవాల‌ని చూస్తున్నారు. ప్రజల మద్దతు కూడగట్టాలని బలంగా నిర్ణయించుకున్న ఆమె చెన్నై, తిరువళ్లూర్, తిరుత్తణిలో మెగా రోడ్‌షో నిర్వహించారు. శశికళ రోడ్ షో సందర్భంగా ప్రజలు, కార్యకర్తలను కలిశారు.

తిరుత్తణిలో ఆమె రోడ్ షోలో మాట్లాడుతూ ఎంజీ రామచంద్రన్ వ్యాఖ్యలను గుర్తు చేశారు. సామాన్య ప్రజలు, పేదల కోసమే పార్టీని ప్రారంభిస్తున్నట్టు రామచంద్రన్ వెల్ల‌డించిన‌ట్టు చెప్పారు. అమ్మ (జయలలిత)లానే ప్రజల సంక్షేమం కోసమే పార్టీ పనిచేసిందన్నారు. ఈ పార్టీకి కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘అమ్మ’ మరణం తర్వాత ఆ బాధ్యత తనపైనే పడిందని, పార్టీని రక్షించాలన్న ఉద్దేశంతోనే రోడ్ షో ప్రారంభించినట్టు వెల్ల‌డించ‌డం ద్వారా పార్టీలో ప‌ట్టుకోసం ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

పార్టీలో అంతర్గత కుమ్ములాటలపై శశికళ చుర‌క‌లంటించారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు తనతోనే ఉన్నారని, పేదలు, సామాన్యుల కోసం త్వరలోనే అన్నాడీఎంకేను అధికారంలోకి తీసుకొస్తానన్నారు. ఇద్దరు వ్యక్తుల కుమ్ములాటల వల్ల పార్టీ సంక్షోభంలోకి వెళ్లింద‌ని ఫ‌ళీన‌, ప‌న్నీర్ గురించి మాట్లాడారు. పార్టీని ముందుకు నడిపించమని పార్టీ కార్యకర్తలు తనను కోరుతున్నారని, అందుకోసం పార్టీ నుంచి బ‌హిష్క‌రించిన వాళ్ల‌ను కూడా క‌లుపుకుని పోతాన‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. లోక్‌సభ ఎన్నికలకు ముందే ఒకే నాయకత్వం కింద పార్టీ ఉంటుంద‌ని, అలా జరిగేలా చూస్తానని శశికళ వెల్ల‌డించ‌డం ఆమె ప్రాధాన్యం పెంచుకునే ప్ర‌య‌త్నం చేశారు.

Exit mobile version