Sasikala : తమిళనాడులో ఈనెల 10 నుంచి శశికళ రోడ్ షోలు, బహిరంగ సభలు

శశికళ రాజకీయాలకు దూరంగానే ఉన్నట్టు కనిపిస్తూనే ఉన్నా.. అవన్నీ పాలిట్రిక్స్ లో భాగమే అంటున్నారు విశ్లేషకులు.

  • Written By:
  • Publish Date - May 2, 2022 / 12:17 PM IST

శశికళ రాజకీయాలకు దూరంగానే ఉన్నట్టు కనిపిస్తూనే ఉన్నా.. అవన్నీ పాలిట్రిక్స్ లో భాగమే అంటున్నారు విశ్లేషకులు. దానికి తగ్గట్టే ఉన్నాయి శశికళ అడుగులు. అన్నాడీఎంకే అసమ్మతి వర్గం నాయకురాలిగా ఆమెకు ఇప్పటికీ పాలిటిక్స్ పై పట్టుంది. అందుకే రాష్ట్రంలో రోడ్ షోలు, బహిరంగ సభల ద్వారా మళ్లీ యాక్టివ్ కావాలనుకుంటున్నారు. గుమ్మిడిపూండి నుంచి కన్యాకుమారి వరకు ఆమె పర్యటనలు ఉంటాయి.

చిన్నమ్మ తన పర్యటనల్లో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోనూ ఓ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. వివిధ ప్రాంతాల్లో ఆమె రోడ్ షోలు ఉంటాయి. దీనికి సంబంధించి షెడ్యూల్ రెడీ అవుతోంది. కొన్నాళ్ల కిందట శశికళ రాష్ట్రంలోని వివిధ ఆలయాలను సందర్శించారు. ఆ టూర్ ఇంకా కొనసాగుతోంది. ఇది పూర్తయిన వెంటనే.. అంటే ఈ నెల 10 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ షో లు మొదలవుతాయి. బహిరంగ సభలు ఉంటాయి.

ఈనెల 10నే తంజావూరులో ఓ పెళ్లికి వెళ్లనున్నారు శశికళ. అప్పుడే తన పొలిటికల్ ఫ్యూచర్ గురించి చెప్పే అవకాశముంది. ఆపై పొలిటికల్ టూర్ మొదలుకానుంది. రోజుకు మూడు నుంచి నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టూర్ ఉండేలా ప్లాన్ చేస్తు్‌న్నారు. అలా 234 నియోజకవర్గాల్లో ఆమె పర్యటన ఉంటుంది. అన్నాడీఎంకేపై అసంతృప్తిగా ఉన్న మాజీ మంత్రులు, ఇతర నాయకులు ఇప్పటికే శశికళను కలుస్తున్నారు. మంతనాలు జరుపుతున్నారు. జయలలిత స్థాయిలో ఆమె టూర్ ఉండేలా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ నెలాఖరులో అన్నాడీఎంకే సర్వసభ్య మండలి సమావేశం ఉంది. దానికి భారీగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో శశికళ ఇలా రాజకీయ పర్యటనలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పైగా ఈ టూర్లలో ఆమె అన్నాడీఎంకేలోని నాయకులనే టార్గెట్ గా చేసుకోబోతున్నారని.. వారిపై విమర్శలు గుప్పించబోతున్నారని టాక్ వినిపిస్తోంది.