Congress: రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో మళ్ళీ రచ్చ

రాజస్థాన్‌ కాంగ్రెస్‌ (Rajasthan Congress)లో అంతర్గత విభేదాలు మళ్లీ రచ్చకెక్కుతున్నాయి. గెహ్లాట్‌, పైలట్ వర్గాల మధ్య చిచ్చు రాజుకుంటూనే ఉంది. తాజాగా మరోసారి మాటలయుద్ధానికి తెరతీశారు ఇద్దరు కీలక నేతలు. బహిరంగ సవాళ్లతో హీట్ పెంచుతున్నారు.

  • Written By:
  • Publish Date - January 21, 2023 / 12:10 PM IST

రాజస్థాన్‌ కాంగ్రెస్‌ (Rajasthan Congress)లో అంతర్గత విభేదాలు మళ్లీ రచ్చకెక్కుతున్నాయి. గెహ్లాట్‌, పైలట్ వర్గాల మధ్య చిచ్చు రాజుకుంటూనే ఉంది. తాజాగా మరోసారి మాటలయుద్ధానికి తెరతీశారు ఇద్దరు కీలక నేతలు. బహిరంగ సవాళ్లతో హీట్ పెంచుతున్నారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య ఆధిపత్య పోరు పార్టీకి తలనొప్పిలా తయారైంది.

పైలట్‌ను సీఎం గెహ్లాట్‌ కరోనా మహమ్మారితో పోల్చడం.. సచిన్‌ కౌంటర్ అటాక్‌కు దిగడంతో రాజకీయం వేడెక్కింది. బుధవారం ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో ప్రీ- బడ్జెట్ సమావేశం నిర్వహించారు రాజస్థాన్‌ సీఎం గెహ్లాట్‌. కొవిడ్ సంక్షోభం తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద కరోనా ప్రవేశించిందంటూ పైలట్‌పై పరోక్ష విమర్శలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతే, పైలట్‌ను గెహ్లాట్ కరోనా వైరస్‌తో పోల్చడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.

Also Read: SSC Exams In 13 Languages: 13 ప్రాంతీయ భాషల్లో SSC పరీక్షలు..!

సచిన్ పైలట్ పేరు ప్రస్తావించకపోయినా.. సీఎం అశోక్ గెహ్లాట్ టార్గెట్‌ మాత్రం ఆయనేనని అందరికీ తెలుసు. కిసాన్ సమ్మేళన్‌ పేరిట రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న పైలట్.. ప్రభుత్వ వైఫల్యాలను ఓ రేంజ్‌లో ఎండగడుతున్నారు. ప్రశ్నపత్రాల లీక్‌ల కారణంగా పలు పరీక్షలు రద్దుకావడం, పనిచేసిన కార్యకర్తలను పక్కన పెట్టడం, రిటైర్డ్‌ బ్యూరోక్రాట్లకు రాజకీయ నియామకాల వంటి అంశాలపై గెహ్లాట్ సర్కార్‌పై డైరెక్ట్‌ అటాక్ చేస్తున్నారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే పైలట్‌ను ముఖ్యమంత్రి కార్నర్ చేశారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

అశోక్‌ గెహ్లాట్ విమర్శలకు తనదైన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చారు సచిన్ పైలట్‌. అందరికీ ఇవ్వాల్సిన గౌరవం ఇస్తేనే..2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సాధ్యమవుతుందంటూ వార్నింగ్ బెల్స్ మోగించారు. గత బీజేపీ ప్రభుత్వ కుంభకోణాలపై చర్యలెక్కడ అంటూ గెహ్లాట్‌ సర్కార్‌ను ఇరుకునపెట్టారు. 2018 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి గెహ్లాట్‌, పైలట్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు రగులుతూనే ఉంది. మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా.. ఇద్దరి మధ్య గొడవలు మాత్రం సద్దుమణగలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఈ విషయంపై సీరియస్‌గా ఫోకస్ పెట్టకపోతే.. రాజస్థాన్ చేజారిపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు .