Site icon HashtagU Telugu

Ukraine Russia War: అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రంపై రష్యా దాడులు.. పేలితే యూరప్ మొత్తం నాశనం..!

Zaporizhzhia Nuclear Power Plant

Zaporizhzhia Nuclear Power Plant

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండు దేశాల మ‌ధ్య‌ ఒక వైపు చర్చలు, మరో వైపు యుద్ధం కొనసాగుతూనే ఉంద‌ది. ఈ క్ర‌మంలో తాజాగా ఉక్రెయిన్‌లోని అణు విద్యుత్ కేంద్రం టార్గెట్‌గా ర‌ష్యా సైనిక ద‌ళం బాంబుల వ‌ర్షం కురిపిస్తుంది. రష్యా దాడులతో జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంటులో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని స్థానిక అధికారులు మీడియాకు తెలిపుతూ ఓ వీడియో సైతం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్ర‌మంలో రష్యా దాడులతో న్యూక్లియర్ పవర్ ప్లాంటులో మంటలు చెల‌రేగ‌డంతో ప్ర‌పంచ వ్యాప్తంగా ఆందోళ‌న వ్య‌క్త‌మవుతోంది.

ఉక్రెయిన్‌తో చర్చలు మొదలుపెట్టినా రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్‌లో ఉన్న యూరప్ లోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రంపై రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోఐరోపాలోనే అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్ అయిన ఎనర్హోదర్ నగరంలోని జపోరిజ్జియా కేంద్రంపై రష్యా దాడులు చేయ‌డంతో ప్ర‌పంచ దేశాలు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డాయి. అయితే ఈ ప్లాంట్ వినియోగంలో లేకున్నప్పటికీ అక్కడ అణు ఇంధనం నిల్వలు ఉండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేప‌ధ్యంలో ఇది పెను విధ్వంసానికి దారి తీసే అవకాశముందని ప్రపంచ దేశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ఇక ఈ అణు విద్యుత్తు కేంద్రం పేలితే చెర్నో బిల్ పేలుడు కంటే పది రెట్లు నష్టం ఎక్కువగా ఉంటుందని, జరిగే నష్టం అంచనా వేయలేమని, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పేలితే యూరప్ మొత్తం నాశనమవుతుందని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఉక్రెయిన్‌కు సరఫరా అయ్యే విద్యుత్తులో 20శాతం ఇక్కడే ఉత్పత్తి అవుతుంది. అంతేకాదు ప్రపంచంలో ఉన్న 10 అతి పెద్ద అణువిద్యుత్ కేంద్రాల్లో ఇది కూడా ఒకటి. మ‌రోవైపు ఈ పవర్ ప్లాంట్‌పై బాంబు దాడి విషయం తెలియగానే అంతర్జాతీయ అణు శక్తి సంస్థ అప్రమత్తమైంది. ఈ క్ర‌మంలో ఉక్రెయిన్ అధికారులతో ప్రస్తుత పరిస్థితి వివరాలు తెలుసుకుని తదుపరి చర్యలకు సిద్ధమైంది. మరోవైపు రష్యా అన్ని వైపుల నుంచి జపోరిజియా పవర్ ప్లాంట్‌ను ధ్వంసం చేసేందుకు బాంబు దాడులు కొనసాగిస్తోందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.

మ‌రోవైపు అదే సమయంలో ఆ ప్రాంతంలో ఉక్రెయిన్ సైన్యం భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసింది. ఈ క్ర‌మంలో మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేపట్టారు. ప్రస్తుతానికి జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంటులో మంటలు అదుపులోకి వచ్చాయని, అక్క‌డి అణు విద్యుత్ కేంద్రం అధికారులు తెలిపారు. అత్యవసర సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పిందని, ఈ బాంబు దాడి ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స‌మాచారం. ఇక మ‌రోవైపు జాపోరిషియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌పై రష్యా దాడిని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. ఈ క్రమంలో పుతిన్ చర్యలు యూరప్ భద్రతకే ముప్పుగా మారాయని ప్ర‌పంచ‌దేశాలు చ‌ర్చించుకుంటున్నాయి. ఇకపోతే గత వారం రోజులనుంచి ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణులు, బాంబు దాడులతో విరుచుకుపడుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు అంతర్జాతీయంగా పలు దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నప్పటికీ పుతిన్ మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం లేదు.