Ukraine Russia War: యుద్ధం ఆపమని పుతిన్ చెప్పినా.. రష్యా సైన్యం వినడం లేదా? ఎందుకు?

  • Written By:
  • Publish Date - March 15, 2022 / 09:30 AM IST

యుద్ధం మొదలు పెట్టడమే దేశాధినేతల చేతుల్లో ఉంటుంది. కానీ దానిని ఆపడం వారికి సాధ్యం కాదు. ఇప్పుడదే పరిస్థితి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫేస్ చేస్తున్నారా? ఆయన చెప్పిన మాటలను ఆయన సైన్యమే వినడం లేదా? ఎందుకంటే దాదాపు మూడు వారాలుగా రష్యా బలగాలు ఉక్రెయిన్ తో పోరాడుతున్నాయి. రాజధాని కీవ్ తో పాటు ముఖ్య నగరాలను కైవసం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశాయి. దీంతో సైన్యమంతా బాగా నీరసించిపోయింది. అందుకే ఈ విషయంలో పుతిన్ సర్దిచెప్పినా సరే.. ఆయన మాట వినకుండా సైన్యం దూసుకెళుతోందంటున్నారు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్.

ప్రధాన నగరాలపై దాడులు చేయడం వల్ల జనావాసాలతోపాటు ప్రజల ప్రాణాలకూ ముప్పు వాటిల్లుతోంది. ఇప్పటికే ఎంతోమంది అమాయక పౌరులు బలైపోయారు. అందుకే ముఖ్యమైన నగరాలపై దాడులు ఆపాలని పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించారు. కానీ రష్యా రక్షణ శాఖ మాత్రం పుతిన్ ఆదేశాలను పట్టించుకోలేదని.. ప్రధాన నగరాలను చేజిక్కించుకోవడమే లక్ష్యంగా దూసుకెళుతోందని తెలుస్తోంది.

ఇప్పటికే ముఖ్యమైన నగరాలపై రష్యా సైనికుల ఫోకస్ ఉంది. ఒక్కోటీ తమ వశం చేసుకుంటూ ఉంది. వాటిని పూర్తిగా తమ కంట్రోల్ లోకి తీసుకున్నాక.. అవసరమైతే సేఫ్ కారిడార్ ద్వారా ఉక్రెయిన్ ప్రజలతోపాటు ఇతర దేశాల వారినీ దేశం దాటిస్తామని తమ అధ్యక్షుడితో చెప్పారట. మరి పుతిన్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే ఈ సమరం వల్ల ఉక్రెయిన్ తో పాటు రష్యా కూడా దారుణంగా నష్టపోతోంది.