Site icon HashtagU Telugu

Ukraine Russia War : ఉక్రెయిన్ రాజధాని రష్యా హస్తగతం..?

Ukraine Capital Kiev War

Ukraine Capital Kiev War

రష్యా దుశ్చర్య కారణంగా ఉక్రెయిన్ చిగురుటాకులా వణికిపోతోంది. దీంతో ఉక్రెయిన్‌లో దారుణ పరిస్థితి నెల‌కొంది. అక్క‌డ న‌గ‌రాల్లో ఎటు చూసినా శిథిలాలే క‌నిపిస్తున్నాయి. రష్యా దాడుల కారణంగా అక్కడ పరిస్థితులు అత్యంత భీతావహంగా ఉన్నాయి. ఉక్రెయిన్‌లోని కీవ్, ఖార్కీవ్, మైదాన్ నెజాలెజ్నోస్టిలో ప్రస్తుత పరిస్థితు దారుణంగా ఉన్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో బాంబుల మోత మోగుతోంది.. ఈ క్రమంలో అక్క‌డ‌ రష్యా దాడులతో అనేక భవనాలు నేలకూలాయని వార్త‌లు సోష‌ల్ మీడియ‌లో ఫొటోల‌తో స‌హా వైర‌ల్ అవుతున్నాయి.

ఇక రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్‌లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ర‌ష్యా సైనికులు బాంబ‌లు వ‌ర్షం కురిపిస్తుండ‌డంతో, ఉక్రెయిన్‌లో లక్ష మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. విరామం లేకుండా రష్యా సైనిక బ‌ల‌గాలు చేస్తున్న దాడుల నుంచి తప్పించుకునేందుకు , ఉక్రెయిన్ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారని తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై ఉక్కుపాదం మోపుతూ, రష్యా సైన్యాలు పెట్రేగిపోతున్నాయి. ఒక‌వైపు బాంబుల వర్షం కురిపిస్తుంటే, మ‌రోవైపు క్షిపణులు, ఫైటర్ జెట్స్, రాకెట్ లాంచర్స్‌తో రష్యా సైన్య‌ ముప్పేట దాడి చేస్తోంది.

తాజాగా ఉక్రెయిన్ ద్వీపంలో 13 మంది సైనికులను ర‌ష్యా సైనికులు హ‌త‌మార్చారు. లొంగిపోవడానికి నిరాకరించిన 13 మంది ఉక్రెయిన్ సైనికులను రష్యా యుద్ధ నౌకలో చంపేశారు. ఉక్రెయిన్‌ ఆక్రమణే త‌మ‌ లక్ష్యం అని ఆ దేశం పై యుద్ధం ప్ర‌క‌టించిన ర‌ష్యా.. ఈ క్ర‌మ‌లో ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయ సలహాదారు మైఖైలో పోడోల్యాక్ అధికారికంగా ప్రకటించారు. భారీ పేలుళ్ళ‌తో ఉక్రెయిన్ రాజధాని కీవ్ అతలాకుతలం అవుతోంది. ఈరోజు కీవ్‌ను స్వాధీనం చేసుకోవాల‌నే ల‌క్ష్యంతో, దాడుల‌ను మ‌రింద పెంచాల‌ని ర‌ష్యా భావిస్తుంది.

ఇక రష్యాతో జరిగే పోరాటంలో ఉక్రెయిన్ ఒంటరి అయిపోయిందని ఆదేశాధ్యక్షుడి జెలెంస్కీ ఆవేదన వ్యక్తం చేశారు. మరో 96 గంటల్లో ఉక్రెయిన్ రాజధాని కీవ్.. రష్యా హ‌స్త‌గ‌తం చేసుకుంటుంద‌ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు. తన హత్యకు రష్యా కుట్ర చేస్తుందని, తన ఫ్యామిలీని కూడా హతమార్చడానికి రష్యా ప్రయత్నిస్తుందని జెలెన్ ఆరోప‌ణ‌లు చేశారు. ర‌ష్యా సైన్యానికి తాము లొంగేది లేద‌ని, ఉక్రెయిన్ సేనలు చివరి వరకూ పోరాడతాయని జెలెన్ స్కీ పేర్కొన్నారు. ఇక‌పోతే ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం ప్రవేశపెట్టనుంద‌ని తెలుస్తోంది. ఈ ముసాయిదాలో కీలక అంశాలు పేర్కొనే అవ‌కాశం ఉంద‌ని సమాచారం.