Site icon HashtagU Telugu

Ukraine Russia War: ఉక్రెయిన్ వ‌ర్సెస్ ర‌ష్యా.. యుద్ధం మొదలైంది..!

Ukraine Russia War

Ukraine Russia War

ప్ర‌పంచ దేశాలు ఏదైతే జ‌ర‌గ‌కూడ‌ద‌ని అనుకున్నారో అదే జ‌ర‌గుతుంది. ఉక్రెయిన్ పై ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ వార్ ప్ర‌క‌టించ‌డంతో యుద్ధం మొదలైంది. కొద్ది రోజులుగా ఉక్రెయిన్, ర‌ష్యా స‌రిహ‌ద్దుల్లో తీవ్రుద్రిక్త‌త‌లు త‌లెత్తిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో యావ‌త్ ప్ర‌పంచాన్ని క‌ల‌వ‌ర‌పెడుతున్న స‌మ‌యంలో, బాంబుల మోత మోగిస్తూ ఉక్రెయిన్‌లోకి ర‌ష్యా దూసుకెళ్ళింది. ఈ క్ర‌మంలో మొద‌ట ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది.

ఇక ఉక్రెయిన్ పై మిలటరీ ఆపరేషన్ మొదలైందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అధికారికంగా ప్రకటించడంతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒక‌వైపు ఉక్రెయిన్‌పై రష్యా మిసైళ్లతో విరుచుకుపడుతుంటే, మ‌రోవైపు ఉక్రెయిన్ కూడా రష్యా సేనలను ధీటుగా ఎదుర్కొంటామని ప్రకటించింది. యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఎమర్జెన్సీ ప్రకటించిన ఆ దేశ అధ్య‌క్షుడు అధ్యక్షుడు జెలెన్ స్కీ, రష్యా దాడి నుంచి తమ దేశాన్ని కాపాడుకుంటామని తెలిపారు.

మ‌రోవైపు ఉక్రెయిన్ పై సైనిక చర్యకు దారి తీసిన కారణాలను రష్యా అధ్య‌క్ష‌డు వ్లాదిమర్ పుతిన్ స్వయంగా వెల్లడించారు. తొలి నుంచి ఉక్రెయిన్ దూకుడుగానే వ్యవహరిస్తూ ర‌ష్యాను క‌వ్విస్తుందని, దీంతో రష్యాపై ఉక్రెయిన్ దాడి చేస్తుందనే ముందుస్తు సమాచారంతోనే, ఆ దేశం పై యుద్దం ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింద‌ని పుతిన్ తెలిపారు. ఇక ఉక్రెయిన్‌ను ఆక్రమించాలని గానీ, ఆ దేశంపై పెత్తనం చెలాయించాలనే ల‌క్ష్యాలు ర‌ష్యాకు లేద‌ని పుతిన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ నుంచి ఎదురవుతున్న ముప్పునకు స్పందనగానే యుద్ధ నిర్ణయం తీసుకున్నట్లు పుతిన్ తెలిపారు.

ఇక మ‌రోవైపు ప్రపంచ దేశాలకు ర‌ష్యా అధ్య‌క్ష‌డు వ్లాదిమ‌ర్ పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. రష్యా చర్యల్లో ఎవరైనా తలదూర్చేందుకు ప్రయత్నం చేస్తే, తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తుందని పుతిన్ హెచ్చరించారు. ఉక్రెయిన్​లో సైనికీకరణకు వ్యతిరేకంగా ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని పుతిన్ అన్నారు. కాగా మొద‌ట ఉక్రెయిన్ రాజ‌ధాని కైవ్ పై మిసైల్స్‌తో రష్యా సైన్యం దాడులు చేసింది. ఆ త‌ర్వాత ఉక్రెయిన్ రెండో అతిపెద్ద నగరమైనా ఖార్కివ్‌ను టార్గెట్ చేస్తూ రష్యా దాడులకు పాల్పడింది. ఆ త‌ర్వాత క్రమటోర్స్క్, దినిప్రో, మరియపోల్, ఒడెస్సా, లెవివ్ న‌గ‌రాల్లోనూ ఉద‌యం 7 గంట‌ల‌కు ర‌ష్యా సైనికులు దాడుల‌కు పాల్ప‌డ్డార‌ని స‌మ‌చారం. దీంతో అక్క‌డి పరిస్థితులు ర‌ణ‌రంగంగా మారాయి.

ఉక్రెయిన్‌కు మద్దతుగా తొలుత‌ అమెరికా రంగంలోకి దిగేందుకు సిద్ధ‌మవుతోంది. ఈ క్ర‌మంలో ఉక్రెయిన్‌కు మ‌ద్ద‌తుగా త‌మ బ‌ల‌గాల‌ను రంగంలోకి దింపేందుకు అమెరికా కూడా రెడీ అవుతుంద‌ని స‌మాచారం. ఈ నేప‌ధ్యంలో రష్యా దాడుల నుంచి ఉక్రెయిన్‌ను కాపాడాలని అమెరికా భావిస్తోంది. ఉక్రెయిన్ ​పై యుద్ధం ప్ర‌క‌టించిన ర‌ష్యా ప్రెసిడెంట్ పుతిన్ పై అమెరికా ఫైర్ అయ్యింది. ఉక్రెయిన్ పై సైనిక దాడుల వల్ల జరిగే విధ్వంసం, ప్రాణనష్టానికి రష్యాదే పూర్తి బాధ్యత అని అమెరికా పేర్కొంది. ప్ర‌పంచ‌దేశాలు శాంతిని కోరుకుంటే, రష్యా యుద్ధాన్ని కోరుకుందని, దీంతో అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి చ‌ర్చించి నిర్ణయాత్మకంగా స్పందిస్తామ‌ని జో బైడెన్ అన్నారు. మ‌రి ఉక్రెయిన్ యుద్ధం మొద‌లు పెట్టిన ర‌ష్యా పై ప్ర‌పంచ దేశాలు ఫైర్ అవుతున్నాయి.