Sangh Parivar Strategy : యూపీలో ఫ్లవర్ ను ఫైర్ గా మార్చింది ఆ ‘సంఘ్’ వ్యూహమేనా? ఇంతకీ ఆ స్కెచ్చేంటి?

ఆ 'సంఘ్' వ్యూహం లేకపోతే యూపీలో బీజేపీ కథ కంచికేనా? ఇంతకీ ఆ 'సంఘ్' వ్యూహం ఏమిటి?

  • Written By:
  • Publish Date - March 11, 2022 / 12:14 PM IST

ఆ ‘సంఘ్’ వ్యూహం లేకపోతే యూపీలో బీజేపీ కథ కంచికేనా? ఇంతకీ ఆ ‘సంఘ్’ వ్యూహం ఏమిటి? ఇప్పుడు ఇదే డిస్కషన్ హాట్ హాట్ గా నడుస్తోంది. మోదీ మ్యాజిక్, యోగీ ఛరిష్మా, అమిత్ షా స్కెచ్ లే పార్టీ విజయానికి కారణాలుగా చెబుతున్నారు. కానీ వీటన్నింటి వెనుక అసలైన కారణం వేరే ఉంది. అదే ఆరెస్సెస్ ప్రచారం. హిందుత్వ విధానాల పరిరక్షణ కోసం పోరాడే సంఘ్ పరివార్ వేసిన మాస్టర్ స్కెచ్ తోనే ఉత్తరప్రదేశ్ లో బేజీపీ గెలిచిందన్న టాక్ పొలిటికల్ సర్కిల్లో నడుస్తోంది.

బీజేపీకి బ్యాక్ బోన్ ఏదంటే వినిపించే ఒకే ఒక సమాధానం.. ఆరెస్సెస్. కమలనాథుల విజయానికి అది అహర్నిశలూ కృషి చేస్తుందంటారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కూడా అదే జరిగిందా? అంటే అవుననే అంటున్నాయి పార్టీ శ్రేణులు. ఎందుకంటే యూపీలో కాని బీజేపీ ఓడిపోతే.. హిందుత్వ విధానాలకే ముప్పు వాటిల్లే ప్రమాదముందని సంఘ్ పెద్దలు భావించినట్లు తెలుస్తోంది. అందుకే సంఘ్ పరివారే ఏకంగా రంగంలోకి దిగినట్లు సమాచారం.

ఆరెస్సెస్ కు దేశంలో 2014 నాటికి 50 నుంచి 60 లక్షల మంది సభ్యులు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపు అయినా ఆశ్చర్యపోనక్కరలేదు. అంటే సంఘ్ పరివార్ లో దాదాపు కోటి మంది ఉండే ఛాన్సుంది. అందుకే వారిలో ప్రతీ రాష్ట్రం నుంచి దాదాపు 2000 మందిని యూపీ ఎన్నికల ప్రచారానికి పంపించినట్టు తెలుస్తోంది. వారు ఉత్తరప్రదేశ్ లో నలుమూలలకు వెళ్లారని.. ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించారని సమాచారం.

సంఘ్ పరివార్ తో పాటు బీజేపీ అభిమానులు కూడా వీడియోల ద్వారా కమలం కోసం ప్రచారం చేశారని.. దానివల్ల చాలామంది ఓటర్లు ప్రభావితం అయ్యారని.. అందుకే యోగీ ఆదిత్యనాథ్ టీమ్ మరోసారి అధికారంలోకి రాగలిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతోపాటు అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి కేంద్రం త్వరితగతిన చర్యలు తీసుకోవడంతోపాటు.. కాశీలో విశ్వనాథుడి కారిడార్ విస్తరణ పనులను కూడా ప్రోత్సహించిందని తెలుస్తోంది. అందుకే మోదీ-షా-యోగీల త్రయం ఈ ఎన్నికల్లో సక్సెస్ అయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనివల్లే యూపీలో బీజేపీ ఫ్లవర్ కాస్తా ఫైర్ అయ్యిందని పొలిటికల్ వర్గాల భావన.