RSS Chief : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో హింసకు బలవుతున్న హిందువులను రక్షించాల్సిన బాధ్యత భారత్‌పై ఉందని ఆయన కామెంట్ చేశారు. రాబోయే తరాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని మోహన్ భగవత్ తెలిపారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మోహన్ భగవత్(RSS Chief) మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలో ఎప్పుడూ ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయించే వ్యక్తులు(అమెరికా) ఉంటారు. ప్రజలు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి. వారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి’’ అని సూచించారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘పరిస్థితి ఎల్లవేళలా ఒకేలా ఉండదు. ఇప్పుడు పొరుగు దేశంలో అలాంటి పరిస్థితే ఉంది. అక్కడి హిందువులపై ఎలాంటి కారణం లేకుండా దాడులు జరుగుతున్నాయి’’ అని బంగ్లాదేశ్‌ను ఉద్దేశించి పరోక్షంగా మోహన్ భగవత్ వ్యాఖ్యలు చేశారు. ఇతరులకు సహాయం చేసే సంప్రదాయం ముందు నుంచే భారతదేశంలో ఉందన్నారు. గత కొన్నేళ్లుగా ఎవరిపైనా భారత్ దాడి చేయలేదని గుర్తుచేశారు. బంగ్లాదేశ్‌లోని అస్థిరత, అరాచకాల వల్ల అక్కడున్న హిందువులు ఇబ్బందిపడాల్సి వస్తోందని ఆర్‌ఎస్ఎస్ చీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read :Divorce Laws : చైనాలో ఇక విడాకులు టఫ్.. పెళ్లిళ్లు ఈజీ.. ఎందుకు ?
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసినప్పటి నుంచి ఇప్పటివరకు దేశంలోని హిందువులపై 48 జిల్లాల పరిధిలో 278 చోట్ల దాడులు జరిగాయి. ఈవిషయాన్ని బంగ్లాదేశ్ నేషనల్ హిందూ గ్రాండ్ అలయన్స్ ప్రకటించింది. హిందువుల ఆలయాలపైనా అల్లరిమూకలు దాడులు చేసినట్లు అక్కడి మీడియాలోనే కథనాలు వస్తున్నాయి. దీనిపై ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా స్పందించారు. మైనారిటీ హిందువులకు రక్షణ కల్పించాలని కొత్త బంగ్లాదేశ్‌లో ఏర్పడిన ప్రభుత్వానికి ఆయన సూచించారు. మరోవైపు భారత్‌లో ఉన్న షేక్ హసీనా కూడా తమ దేశ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అల్లరి మూకల హింసాకాండను చూడలేకే తాను దేశం వదిలి వచ్చానని ఆమె అంటున్నారు.