Bribe To Doctors : మహారాష్ట్రలోని పూణేలో జరిగిన లగ్జరీ పోర్షే కారు ప్రమాదం కేసులో మరో కీలక విషయం బయటపడింది. ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇద్దరు యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను బలిగొన్న మైనర్ బాలుడిని కాపాడేందుకు అతడి పేరెంట్స్ చేసిన మరో ప్రయత్నం వెలుగుచూసింది. ఆ బాలుడు పోలీసులకు దొరికిన వెంటనే.. అతడి బ్లడ్ శాంపిల్‌ను సేకరించి సమీపంలోని ససూన్ ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన ఫోరెన్సిక్ ల్యాబుకు పంపారు. అయితే నిందితుడైన బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్ అక్కడికి వెళ్లి.. ఫోరెన్సిక్ ల్యాబ్ వ్యవహారాలు చూసే వైద్యులతో భేటీ అయ్యాడు. బేరసారాల అనంతరం వారికిి రూ.3 లక్షలు ఇచ్చాడని పోలీసు విచారణలో తాజాగా బట్టబయలైంది. ససూన్ ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన ఇద్దరు డాక్టర్లు అజయ్ తావ్డే, హరిహార్నర్, మరో వైద్య సహాయకుడిని సోమవారం ఉదయమే పూణే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. వారిని ప్రశ్నించగా.. ముడుపులు ఎంతమేర ముట్టాయనేది చెప్పేశారు. అనంతరం ఆ ముగ్గురిని కోర్టులో ప్రవేశపెట్టగా మే 30 వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
We’re now on WhatsApp. Click to Join
ససూన్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ముడుపులు(Bribe To Doctors) పుచ్చుకున్న తర్వాత సదరు బాలుడి బ్లడ్ శాంపిల్‌ను చెత్తబుట్టలో పడేశారు. అనంతరం మరో వ్యక్తి బ్లడ్ శాంపిల్ ఆధారంగా మెడికల్ రిపోర్టును తయారు చేసి పోలీసులకు అందించారు. ఈవివరాలను పూణె సీపీ అమితేశ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. బాలుడి రక్తంలో ఆల్కహాల్ (మద్యం) ఉందా ? లేదా ? అనేది తెలుసుకునేందుకు అతడి బ్లడ్ శాంపిల్‌ను ల్యాబుకు పంపారు. తన కొడుకు మద్యం తాగలేదని నిరూపించేందుకు ఈ ముడుపుల బాగోతాన్ని అతడి తండ్రి నడిపాడని పోలీసులు గుర్తించారు. వాస్తవానికి సదరు మైనర్ నిందితుడు పోర్షే కారును ర్యాష్‌గా డ్రైవ్ చేయడానికి ముందు పూణేలోని ఓ ల్యాబులో దర్జాగా కూర్చొని మద్యం తాగుతున్న వీడియో ఫుటేజీ పోలీసులకు దొరికింది. అయితే ల్యాబ్ రిపోర్టులో మాత్రం అతడు మద్యం తాగలేదని వచ్చింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి బ్లడ్ శాంపిల్‌ను పరీక్షించిన డాక్టర్లను, మైనర్ బాలుడి తండ్రిని తమదైన శైలిలో ఇంటరాగేట్ చేసి నిజాన్ని చెప్పించారు.