Site icon HashtagU Telugu

North Eastern States: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రూ.2 లక్షల కోట్లు ఖర్చు!

North Eastern states

North Eastern states

North Eastern States: ఈశాన్య రాష్ట్రాల (North Eastern States) అభివృద్ధిపై నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి దాదాపు రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. యూపీఏ హయాంతో పోలిస్తే మోదీ పాలనలో మేఘాలయలో ప్రజల జీవన ప్రమాణలు ఎంతో మెరుగయ్యాయని చెప్పారు. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, వ్యవసాయం, రోడ్లు & తాగునీటి రంగాల్లో మేఘాలయ రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. కేంద్ర రహదారుల మౌలిక సదుపాయల నిధి( CRIF) కింద చేపట్టిన రోడ్ల పనులు, పోషణ అభియాన్ నిధులు, వృత్తి విద్యలో అసెస్‌మెంట్, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 75 శాతం ప్రసవాలు ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయని తెలిపారు.

ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు ఉదయం అరుణాచల్ ప్రదేశ్ నుండి గౌహతి మీదుగా మేఘాలయ రాష్ట్రంలోని షిల్లాంగ్ వెళ్లారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కు రాష్ట్ర ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. స్థానిక పోలీసులు కేంద్ర మంత్రికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం నేరుగా షిల్లాంగ్ లోని రాష్ట్ర సచివాలయానికి వెళ్లిన కేంద్ర మంత్రి ఆ రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల అమలు తీరుపై సమీక్షించారు. ఆయా పథకాల అమలు తీరుపై శాఖల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Also Read: Heavy Rains: ఏపీలోని ఈ జిల్లాల్లో రేపు వ‌ర్షాలు!

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసి ఇప్పటిదాకా రెండు లక్షల కోట్ల రూపాయల నిధులను వెచ్చించిందని ఆయన వివరించారు. 2014 కు పూర్వం ఈశాన్య రాష్ట్రాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆయన అన్నారు. మోడీ ప్రధాని అయ్యాక కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పట్ల మేఘాలయ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని అధికారులు కేంద్రమంత్రికి వివరించారు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేవలం నిధులు కేటాయించడమే కాకుండా కేంద్ర మంత్రుల్ని ఒక్కో రాష్ట్రానికి పంపి అక్కడి అభివృద్ధిపై సమీక్ష చేసి అభివృద్ధి పనులను వేగవంతం చేయడం, ప్రజల కోరిక మేరకు ఇంకా అభివృద్ధి చేయాలనే ఆలోచన మోడీగారి నిజాయితీకి, నిబద్ధతకు నిదర్శనమని బండి సంజయ్ చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో మేఘాలయ చీఫ్ సెక్రటరీ షకిల్ అహ్మద్ డిజిపి శ్రీమతి ఇదాశిష నాంగ్రంగ్ తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.