ఆర్థిక నేరస్తుల నుంచి రుణాలను వసూలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం (Central Govt) కీలక ముందడుగులు వేసిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (FM Nirmala Sitharaman) తెలిపారు. లోక్‌సభలో మాట్లాడుతూ.. ఈ ఏడాది రూ.22 వేల కోట్లకు పైగా నిధులను బ్యాంకులకు తిరిగి చెల్లించామని వివరించారు. ఈ మొత్తం మొత్తంలో రూ.14 వేల కోట్లు (Rs 14,000 crore ) విజయ్ మాల్యా ఆస్తుల విక్రయం (Mallya assets sales) ద్వారా వచ్చినట్లు వెల్లడించారు. విజయ్ మాల్యా దేశంలో ఉన్న ఆస్తులను వేలం వేసి బ్యాంకుల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు.
గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ నుంచి కూడా రూ.1,000 కోట్లు రాబట్టినట్లు తెలిపారు. బ్యాంకు రుణాలను ఎగ్గొట్టిన ఆయన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసి స్పెషల్ కోర్టు అనుమతితో వేలం వేసి నిధులను బ్యాంకులకు చెల్లించారు. ఈ చర్యలు బ్యాంకుల నష్టాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయని నిర్మలా సీతారామన్ అన్నారు. మరొక వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ సంబంధించి రూ.2,566 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందని మంత్రి తెలిపారు. ఆయన పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి తీసుకున్న రూ.13 వేల కోట్లకు పైగా రుణాలను ఎగ్గొట్టారు. ఈ ఆస్తులను స్పెషల్ కోర్టు అనుమతితో వేలం వేసి బ్యాంకులకు తిరిగి నిధులను చెల్లించే ప్రక్రియ జరుగుతోందని తెలిపారు.
రుణ ఎగవేతదారుల నుంచి మొత్తం రూ.22,280 కోట్లు వివిధ బ్యాంకులకు చెల్లించామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి పరారీలో ఉన్న నేరస్తుల ఆస్తులను ఈడీ అటాచ్ చేసి, కోర్టు ఆదేశాలతో విక్రయించడం ద్వారా ఈ నిధులను రాబట్టినట్లు చెప్పుకొచ్చారు. ఈ చర్యలు బ్యాంకుల పునరుద్ధరణకు సహకరిస్తాయని పేర్కొన్నారు. ఆర్థిక నేరాలను నియంత్రించడంలో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం (పీఎంఎల్ఏ) కీలకంగా పని చేస్తున్నదని సీతారామన్ చెప్పారు. ఈ చట్టం ప్రకారం ఆర్థిక నేరస్తుల నుంచి నిధులను రాబట్టి బ్యాంకులకు చెల్లించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు.
Read Also : HMIL : ‘ఆర్ట్ ఫర్ హోప్’ 2025 గ్రాంటీలను ప్రకటించిన హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫౌండేషన్