120 Cr In PFI Accounts: పీఎఫ్ఐ అకౌంట్లలో 120 కోట్లు.. ప్రముఖ నేతలపై దాడికి ఆ సంస్థ ప్లాన్లు!!

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సంస్థకు గత కొన్నేళ్లలో వివిధ ఖాతాల నుంచి సుమారు రూ.120 కోట్లు వచ్చినట్టు కేంద్ర హోంశాఖ గుర్తించింది.

  • Written By:
  • Publish Date - September 25, 2022 / 12:01 PM IST

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సంస్థకు గత కొన్నేళ్లలో వివిధ ఖాతాల నుంచి సుమారు రూ.120 కోట్లు వచ్చినట్టు కేంద్ర హోంశాఖ గుర్తించింది. ముఖ్యంగా ఎన్ఐఏ దర్యాప్తులో ఈ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశంలోని 15 రాష్ట్రాల్లో ఉన్న దాదాపు 150 ప్రాంతాల్లో ఎన్ఐఏ నిర్వహించిన సోదాల్లో దీనికి సంబంధించిన ఆధారాలు లభించాయి. బ్యాంకింగ్, హవాలా నెట్‌వర్క్‌ల ద్వారా భారతదేశంతో పాటు విదేశాల నుంచి నిధులను పీఎఫ్ఐ సేకరిస్తున్నట్లు గుర్తించారు.
ఈ నిధులతో అక్రమ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఈడీ, ఎన్ఐఏ విచారణలో తేలింది.ఈ క్రమంలోనే ఆ సంస్థపై నిషేధం విధించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ప్రధాని మోదీ ర్యాలీ లక్ష్యంగా..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై దాడి చేసేందుకు పీఎఫ్ఐ పథకం రచించిందని ఈడీ సంచలన విషయం వెల్లడించింది. ఈ మధ్య పీఎఫ్ఐ కార్యాలయాలు, దాని మద్దతుదారులపై ఎన్ఐఏ, ఈడీ దాడులు చేసి పదుల సంఖ్యలో అరెస్టులు చేశాయి. ఈ క్రమంలో జులై 12 న బీహార్ లో జ‌రిగిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ర్యాలీని ల‌క్ష్యంగా చేసుకొని దాడి చేసేందుకు పీఎఫ్ఐ ప‌థ‌కం ప‌న్నిన‌ట్లు తెలిసింద‌ని ఈడీ వెల్ల‌డించింది. అయితే, పీఎఫ్ఐ ఈ దాడి చేయలేకపోయింది. కేర‌ళలో ఇటీవల అరెస్ట‌యిన పీఎఫ్ఐ స‌భ్యుడు ష‌ఫీక్ పాయెత్ రిమాండ్ రిపోర్టులో ఈ విషయాలను ఈడీ వెల్లడించింది. జులై 12న ప్ర‌ధాని మోదీ పాట్నాకు వెళ్లే స‌మ‌యంలోనే దాడులు చేసేందుకు తమ సభ్యులకు పీఎఫ్ఐ కోచింగ్ క్యాంపును ఏర్పాటు చేసింద‌ని తెలిపింది.

అమిత్ షా ఆదేశాలు..

ఈనేపథ్యంలో పీఎఫ్ఐ వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. అన్సాద్ బద్రుద్దీన్, మౌద్ అహ్మద్ అనే ఇద్దరు పీఎఫ్‌ఐ సభ్యులు వివిధ పీఎఫ్‌ఐ ఖాతాల నుంచి నిధులు పొందారని ఇటీవల జరిపిన దర్యాప్తులో తేలింది. పీఎఫ్ఐ సభ్యులు ఇతర సభ్యులకు.. తీవ్రవాద చర్యలకు పాల్పడేందుకు శిక్షణ ఇచ్చారని వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే.. దేశవ్యాప్తంగా 100 మంది పీఎఫ్ఐ నేతలను ఎన్ఐఏ, ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు ఐదుగురు పీఎఫ్ఐ సభ్యులను సెప్టెంబర్ 26 వరకు మహారాష్ట్ర ఏటీఎస్ కస్టడీకి పంపింది.

ఆపరేషన్ ఆక్టోపస్..

పీఎఫ్ఐ సంస్థలపై దాడులకు “ఆపరేషన్ ఆక్టోపస్” అని ఎన్ఐఏ పేరు పెట్టినట్లు సమాచారం. సెప్టెంబర్ 22న ‘ఆపరేషన్ ఆక్టోపస్’ కింద దేశవ్యాప్తంగా ఎన్ఐఏ, ఈడీ, రాష్ట్ర పోలీసుల సంయుక్త బృందం 15 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ,ఢిల్లీ, కేరళ , కర్ణాటక , తమిళనాడు , ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, పశ్చిమ బెంగాల్ , బీహార్, మణిపూర్ రాష్ట్రాల్లో సోదాలు చేపట్టింది. మొత్తం 96 చోట్ల జరిపిన దాడుల్లో 106 మందికి పైగా పీఎఫ్‌ఐ సభ్యులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో పిఎఫ్‌ఐ ఛైర్మన్‌ ఒఎంఎ సలామ్‌, వైస్‌ ఛైర్మన్‌ ఇఎం అబ్దుల్‌ రహీమ్‌, జాతీయ కార్యదర్శి నజరుద్దీన్‌ ఎలమారం, కేరళ రాష్ట్ర చీఫ్‌ సిపి ముహమ్మద్‌ బషీర్‌, నేషనల్‌ కౌన్సిల్‌ సభ్యుడు ప్రొఫెసర్‌ పి కోయా, ఎస్‌డిపిఐ వ్యవస్థాపక అధ్యక్షుడు అబూ బకర్‌ ఉన్నారు.