Site icon HashtagU Telugu

Rs 10000 Crore : జమిలి ఎన్నికల ఖర్చు.. ప్రతి 15 ఏళ్లకు రూ.10వేల కోట్లు : ఈసీ

One Nation One Election

One Nation One Election

Rs 10000 Crore : ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’.. అదేనండీ జమిలి ఎన్నికలపై కేంద్ర సర్కారు కసరత్తును ముమ్మరం చేసింది. ఈక్రమంలోనే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి కేంద్ర సర్కారు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ నేతృత్వంలో హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇటీవల ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి సలహాలు, సూచనలు కూడా స్వీకరించింది. దీనిపై న్యాయ నిపుణులతో  సంప్రదింపులు కూడా జరిపింది. పలు పార్టీల ముఖ్య నాయకులతో సంప్రదింపులు సైతం జరిపింది. ఈక్రమంలోనే జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర న్యాయశాఖ పంపిన ప్రశ్నావళికి ఎన్నికల సంఘం సమాధానాలు ఇచ్చింది. ఇంతకీ న్యాయశాఖకు ఈసీ ఏం చెప్పింది ? జమిలి ఎన్నికల నిర్వహణ వ్యయాలపై అది చెప్పిన అంచనాలు ఏమిటి ? ఇప్పుడు తెలుసుకుందాం.

We’re now on WhatsApp. Click to Join.

కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయం ఇదీ..

  • జమిలి ఎన్నికలకు వెళ్తే కనిష్ఠంగా 46,75,100 బ్యాలెట్‌ యూనిట్లు , 33,63,300 కంట్రోల్‌ యూనిట్లు, 36,62,600 వీవీప్యాట్‌ యంత్రాలు కావాలి.
  • 2023 ప్రారంభం నాటికి ఈవీఎం ధరను పరిశీలిస్తే.. ఒక్కో బ్యాలెట్‌ యూనిట్‌ ధర రూ.7900, కంట్రోల్‌ యూనిట్‌ ధర రూ.9,800, వీవీప్యాట్‌ ధర రూ.16వేలుగా ఉంది. ఈ లెక్కన ప్రతి 15ఏళ్లకోసారి కొత్త ఈవీఎంలను కొనేందుకు రూ.10వేల కోట్లు(Rs 10000 Crore) అవసరం.
  • ఎలక్ట్రానిక్ ఓటింగ్‌ యంత్రాలు గరిష్ఠంగా 15ఏళ్లు పనిచేస్తాయి. జమిలి ఎన్నికలను నిర్వహిస్తే.. ఒక సెట్‌ యంత్రాలను వాటి జీవితకాలంలో మూడు సార్లు వాడాల్సి ఉంటుంది.
  • జమిలి ఎన్నికలకు వెళ్తే.. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి రెండు సెట్ల ఈవీఎంలు కావాలి. ఒకటి లోక్‌సభ స్థానానికి, మరొకటి అసెంబ్లీ నియోజకవర్గానికి అవసరం.
  • సమస్యాత్మక యంత్రాల స్థానంలో కొత్తవాటిని భర్తీ చేసేందుకు కొన్ని కంట్రోల్‌ యూనిట్లు (సీయూ), బ్యాలెట్‌ యూనిట్లు (బీయూ), వీవీప్యాట్ మెషిన్లను అదనంగా రిజర్వ్‌ చేయాల్సి ఉంటుంది. కనీసం ఒక ఈవీఎంకు ఒక బీయూ, సీయూ, వీవీప్యాట్‌ అవసరం.
  • ఒకేసారి ఎన్నికలను నిర్వహించాలంటే అదనపు పోలింగ్‌, భద్రతా సిబ్బంది, ఈవీఎంల స్టోరేజీ సదుపాయాలు, మరిన్ని వాహనాలు అవసరమవుతాయి.
  • కొత్త యంత్రాల తయారీ, రవాణా, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే 2029 నుంచే జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యమవుతుంది.
  • జమిలి ఎన్నికల నిర్వహణ కోసం రాజ్యాంగంలోని ఐదు అధికరణాలను సవరించాల్సి ఉంటుంది.

Also Read: Myanmar Border : మయన్మార్ బార్డర్‌లో కంచె నిర్మిస్తామన్న అమిత్‌షా.. ఎందుకు ?