Salman Khurshid : స‌ల్మాన్ హిందూ`ఉగ్రవాదం`పై క‌మ‌ల‌`నాదం`

అయోధ్య‌పై పుస్త‌కం రాసిన కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ లీడ‌ర్ స‌ల్మాన్ ఖుర్షీద్ వివాదస్ప‌ద లీడ‌ర్ గా మారాడు. ఆ పుస్త‌కంలో స‌నాత‌న ధ‌ర్మం, హిందుత్వం గురించి ప్ర‌స్తావించాడు.

  • Written By:
  • Updated On - November 12, 2021 / 03:00 PM IST

అయోధ్య‌పై పుస్త‌కం రాసిన కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ లీడ‌ర్ స‌ల్మాన్ ఖుర్షీద్ వివాదస్ప‌ద లీడ‌ర్ గా మారాడు. ఆ పుస్త‌కంలో స‌నాత‌న ధ‌ర్మం, హిందుత్వం గురించి ప్ర‌స్తావించాడు. అంతేకాదు, ప్ర‌స్తుతం క‌రుడుక‌ట్టిన హిందుత్వం రాజ్య‌మేలుతోంద‌ని వ్యాఖ్యానించాడు. ఇప్పుడున్న హిందూయిజంలోని మ‌రో కోణాన్ని తెలియ‌చేస్తూ ..దాన్ని రాజ‌కీయ హిందుత్వంగా పొందుప‌రిచాడు. ఉగ్ర‌వాద సంస్థ ఐసీస్, బోకో హ‌రామ్ లాంటి ఇస్టామిక్ జీహాదీ గ్రూపుల‌తో ప్ర‌స్తుత హిందూయిజాన్ని పోల్చాడు. దీంతో బీజేపీ నేత‌లు కుర్షీద్ పై మండిప‌డుతున్నారు.

స‌మీప భ‌విష్య‌త్ లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్నాయి. వాటిని సెమీ ఫైన‌ల్ కింద జాతీయ పార్టీలు భావిస్తున్నాయి. అందుకే, ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పుస్త‌కాన్ని స‌ల్మాన్ చేత రాయించింద‌ని ఆరోపిస్తున్నారు. క‌షాయ ఉగ్ర‌వాదమ‌నే ప‌దాన్ని హిందూయిజానికి జోడించ‌డం కాంగ్రెస్ రాజ‌కీయ వ్యూహంలో భాగంగా బీజేపీ భావిస్తోంది. అందుకే, ఆ పుస్త‌కాన్ని విడుద‌ల చేయ‌కుండా ఆప‌డంతో పాటు స‌ల్మాన్ ఖుర్షీద్ ను కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌హిష్క‌రించాల‌ని క‌మ‌ల‌నాథులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే, జ‌ర‌గ‌బోవు ప‌రిణామాల‌కు సోనియా, రాహుల్ బాధ్య‌త వ‌హించాల‌ని హెచ్చ‌రిస్తున్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ అయోధ్యపై “సన్ రైజ్ ఓవర్ అయోధ్య: నేషనల్ హుడ్ ఇన్ అవర్ టైమ్స్ష అనే పుస్త‌కాన్ని రాశాడు. ఆ పుస్త‌కంలో పొందుప‌రిచిన అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ దేశంలో మతపరమైన విశ్వాసాలను దెబ్బతీస్తున్నాయ‌ని బీజేపీ నేత‌లు అంటున్నారు. “హిందూయిజాన్ని ఐసిస్, బోకో హరామ్ లతో పోల్చుతారా? భారత్ లో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఎందుకు చేస్తోంది? కాంగ్రెస్ పార్టీ హిందువులకు వ్యతిరేకంగా సాలెగూడు అల్లుతోంది. ఇదంతా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు తెలిసే జరుగుతోంది. హిందూ టెర్రరిజం అనే పదం కాంగ్రెస్ కార్యాలయంలోనే పుట్టింది” అని భాటియా వ్యాఖ్యానించారు.

మ‌హాత్మాగాంధీకి వ్య‌తిరేకంగా గాడ్సేకు అనుకూలంగా చాలా సంద‌ర్భాల్లో బీజేపీ నేత‌లు వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో అలాంటి వ్యాఖ్య‌లు దుమారం కూడా రేపాయి. అంతేకాదు, అనాదిగా ఉన్న పుస్త‌కాల్లోని భావ‌జాలాన్ని కూడా మోడీ స‌ర్కార్లోని ప‌లువురు బీజేపీ నేత‌లు వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన సంద‌ర్భాలు అనేకం. తినే ఆహారం నుంచి ప‌లు అంశాలు 2014 నుంచి అస‌హ‌నానికి నాంది ప‌లికాయి. అందుకు ప్ర‌తిగా అవార్డ్ వాప‌సీలాంటి సంఘ‌ట‌న‌ల‌ను మోడీ ప్ర‌భుత్వం ఎదుర్కొంది. అయిన‌ప్ప‌టికీ హిందూభావ‌జాలాన్ని ఆ పార్టీ నేత‌లు కొంద‌రు బ‌లంగా వినిపిస్తూ త‌ర‌చూ స‌మాజంలో ఎదో ఒక విధ‌మైన అల‌జ‌డిని రేపుతుంటారు.తాజాగా టీ 20 మ్యాచ్ ఓట‌మి సంద‌ర్భంగా క్రికెట‌ర్ ష‌మీని సోష‌ల్ మీడియా వేదిక‌గా బీజేపీ క్యాడ‌ర్ టార్గెట్ చేసింది. అందుకు ప్ర‌తిగా నెటిజన్ల రూపంలో యూపీఏలోని పక్షాల శ్రేణులు ష‌మీకి మ‌ద్ధ‌తుగా నిలిచాయి. ఎంఐఎం చీఫ్ ఓవైసీ త‌ర‌చూ హిందూమతం మీద వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తుంటారు. స‌రిహ‌ద్దుల్లో జ‌రుగుతోన్న ప‌రిణామాల‌పై మాట్లాడుతూ వివాదస్ప‌దం అవుతుంటారు. ప్ర‌తిగా బీజేపీ కూడా ఎంఐఎం మీద విరుచుకుప‌డుతుంటుంది. తాజాగా చైనా, భార‌త్ స‌రిహ‌ద్దుల్లో జరుగుతోన్న ప‌రిణామాల‌పై వ్యాఖ్యానించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ను వివాదంలోకి బీజేపీ లాగింది. దేశ‌భ‌క్తి లేని కేసీఆర్ అంటూ ధ్వ‌జ‌మెత్తారు. హిందుత్వాన్ని, జాతీయ‌తావాదాన్ని పేటెంట్ గా భావిస్తోన్న బీజేపీ త‌ర‌చూ విప‌క్ష పార్టీల నేత‌ల వ్యాఖ్య‌లు, పుస్త‌కాల‌పై దాడికి దిగ‌డం పరిపాటిగా మారింది. నిజ‌మైన సెక్యూర‌ల్ పార్టీ అంటూనే హిందుత్వాన్ని త‌న సొంత మార్క్ గా మార్చేసుకుని ప్ర‌త్య‌ర్థుల‌పై చెల‌రేగి పోతోంది. ఇప్పుడు స‌ల్మాన్ ఖుర్షీద్ రాసిన పుస్త‌కం వ్య‌వ‌హారం రాబోవు ఎన్నిక‌ల్లో వివాదం కానుంది. దానికి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఫుల్ స్టాప్ పెడుతుందో చూద్దాం.