Odisha: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం, 8 మంది దుర్మరణం, 12 మందికి గాయాలు

ప్రమాదం తర్వాత కొన్ని గంటలపాటు ఎన్‌హెచ్‌పై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

  • Written By:
  • Publish Date - December 1, 2023 / 04:35 PM IST

Odisha: శుక్రవారం ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో వ్యాన్..  ట్రక్కును వెనుక నుండి ఢీకొట్టడంతో ఒక కుటుంబానికి చెందిన ఎనిమిది మంది సభ్యులు మరణించారు. మరో 12 మంది గాయపడ్డారు. గంజాం జిల్లాలోని దిగపహండి ప్రాంతానికి చెందిన పొడమరి గ్రామానికి చెందిన ఒక కుటుంబం మా తారిణి ఆలయంలో పూజలు చేసేందుకు ఘటగావ్‌కు వెళుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆలయాన్ని సందర్శించేందుకు వారు వ్యాన్‌ను అద్దెకు తీసుకున్నారు.

“టాటా వింగర్‌లో మొత్తం 20 మంది వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. అయితే ప్రమాదవశాత్తు ట్రక్కును ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. మృతదేహాలు హైవేపై చెల్లాచెదురుగా పడ్డాయి. తదుపరి విచారణ కొనసాగుతోంది” అని వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను కియోంజర్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం తర్వాత కొన్ని గంటలపాటు ఎన్‌హెచ్‌పై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా, ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి ఉచితంగా వైద్యం అందించాలని, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.