తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth ) కేంద్ర ప్రభుత్వం (Modi Govt) అమలు చేయాలని చూస్తున్న మూడు భాషల ఫార్ములా(Three Language Policy)పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందీని బలవంతంగా తమపై రుద్దవద్దని స్పష్టం చేస్తూ, “హిందీ జాతీయ భాష కాదు, కేవలం ఎక్కువ మంది మాట్లాడే భాష మాత్రమే” అని వ్యాఖ్యానించారు. తెలుగు, బెంగాలీ భాషలు కూడా హిందీ తర్వాత ఎక్కువ మందిచే మాట్లాడబడతాయని గుర్తుచేశారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలుగు భాష అభివృద్ధికి ఏం చేశారు? అని ప్రశ్నిస్తూ, హిందీని ప్రాధాన్యత ఇవ్వడం వెనుక రాజకీయం ఉందని విమర్శించారు.
భాషపై బలవంతం చేయడం తగదు
భారతదేశం విభిన్న భాషలు, సంస్కృతులతో కూడిన బహుళతా దేశం అని, ఇక్కడ ఏ భాషనూ బలవంతంగా రుద్దడం అనైతికం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా హిందీని ప్రతిభాషపైకి మోపే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. భాష అనేది ప్రదేశానికి, సంస్కృతికి సంబంధించిన విషయం అని, విద్యా వ్యవస్థలో హిందీని ఆప్షనల్‌గా ఉంచాలి కానీ, తప్పనిసరి చేయడం అప్రజాస్వామికం అని అన్నారు. తెలుగు మాట్లాడే ప్రజల హక్కులను రక్షించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
గుజరాత్ మోడల్ ఔట్డేటెడ్ – టెస్టు మ్యాచ్ లాంటిది
గుజరాత్ మోడల్ అనేది పూర్తిగా పాతదైన మోడల్ అని, అది టెస్టు మ్యాచ్ లాంటిదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇండియా టుడే కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన, మోదీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ మోడల్ మాత్రం టీ20 క్రికెట్ లాంటి వేగవంతమైన అభివృద్ధిని అందిస్తోందని, గుజరాత్ మోడల్ కేవలం ప్రచారానికి ఉపయోగపడే లెక్క అని ఎద్దేవా చేశారు. మోదీ ప్రధాని అయినా దేశాన్ని గుజరాత్ మోడల్ వైపే తీసుకెళ్లడం సరైంది కాదని, దేశ అభివృద్ధికి తెలంగాణ మోడల్ అనుసరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
తెలంగాణ మోడల్‌కు మోదీ తోడు ఇస్తారా?
తెలంగాణ మోడల్ సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నిలయమని రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో ORR, ఐటీ, ఫార్మా ఇండస్ట్రీలు భారీ స్థాయిలో అభివృద్ధి చెందాయని, తెలంగాణ అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది అని అన్నారు. మోదీ గుజరాత్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కంటే, అభివృద్ధిలో ముందున్న తెలంగాణ మోడల్‌ను స్వీకరించడం అవసరం అని పేర్కొన్నారు. తెలంగాణను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు కేంద్రం సహకరించాలంటే, రాష్ట్రానికి సముచిత నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
Telangana Economic Situation : తెలంగాణ ఆర్థిక పరిస్థితి పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు