Reusable Water Bottles: రీయూజబుల్ వాటర్ బాటిల్స్ పై టాయిలెట్ సీటు కంటే 40,000 రెట్లు ఎక్కువ బాక్టీరియా.. ఎందుకు..?

రీయూజబుల్ వాటర్ బాటిల్స్ (Reusable Water Bottles) వినియోగం చాలా ఎక్కువ. చాలామంది వీటిని నిత్యం వినియోగిస్తుంటారు. మన ఇళ్లలోని ఫ్రిజ్ లలో కూడా రీయూజబుల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి.

  • Written By:
  • Publish Date - March 18, 2023 / 08:55 AM IST

రీయూజబుల్ వాటర్ బాటిల్స్ (Reusable Water Bottles) వినియోగం చాలా ఎక్కువ. చాలామంది వీటిని నిత్యం వినియోగిస్తుంటారు. మన ఇళ్లలోని ఫ్రిజ్ లలో కూడా రీయూజబుల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి. వాటిని సరిగ్గా మెయింటైన్ చేయకుంటే.. పర్ఫెక్టుగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకుంటే పెద్దఎత్తున క్రిములు పేరుకుపోతాయట. ఇలా అపరిశుభ్రంగా ఉంచే రీయూజబుల్ వాటర్ బాటిల్స్ పై టాయిలెట్ సీటు కంటే 40,000 రెట్లు ఎక్కువ మోతాదులో బాక్టీరియా నిల్వ ఉంటుందట. తాజా అధ్యయనంలో ఈవిషయం వెల్లడైంది. US వెబ్‌సైట్ waterfilterguru.comలో ఈ స్టడీ రిపోర్ట్ పబ్లిష్ అయింది. ఇన్‌ స్టాగ్రామ్, ట్విట్టర్ సహా పలు సోషల్ మీడియాలలో ఇది వైరల్ అవుతోంది.

■ స్టడీ ఇలా జరిగింది

ఈ స్టడీలో భాగంగా waterfilterguru.comకు చెందిన నిపుణులు స్క్వీజ్-టాప్ మూత, చిమ్ము మూత, స్క్రూ-టాప్ మూత కలిగిన రీయూజబుల్ వాటర్ బాటిల్స్ ను ఎంపిక చేసుకున్నారు. వాటి మూతలను ఒక్కోదాన్ని మూడుసార్లు శుభ్రపరిచిన తర్వాత .. ఉపరితలంపై బ్యాక్టీరియా, ఇతర క్రిములు ఉన్నాయా? లేదా? అనేది సైంటిఫిక్ పద్ధతిలో చెక్ చేశారు. దీంతో గ్రామ్-నెగటివ్ రాడ్‌లు, బాసిల్లస్ అనే జాతుల బ్యాక్టీరియాలను ఆ బాటిల్స్ మూతలపై గుర్తించారు. అనంతరం ఆ బ్యాక్టీరియాల సంఖ్యను కూడా లెక్కించారు. ఇక టాయిలెట్ సీటు పై ఉండే బ్యాక్టీరియాల సంఖ్యను కూడా నమోదు చేశారు. దీంతో అపరిశుభ్రంగా ఉంచే రీయూజబుల్ వాటర్ బాటిల్స్ పై టాయిలెట్ సీటు కంటే 40,000 రెట్లు ఎక్కువ మోతాదులో బాక్టీరియా నిల్వ ఉందని తేలింది.

■ఇవీ హెల్త్ ప్రాబ్లమ్స్

వారి అధ్యయనం ప్రకారం.. కొన్ని బాసిల్లస్ జాతులు జీర్ణశయాంతర సమస్యలను కలిగిస్తాయి. అయితే గ్రామ్-నెగటివ్ బ్యాక్టీరియా మందులతో చికిత్స చేయడం కష్టతరమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. రీయూజబుల్ వాటర్ బాటిల్స్ పై కంప్యూటర్ మౌస్ కంటే రెండింతలు.. కిచెన్ సింక్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ .. పెంపుడు జంతువుల ఎంగిలి నీటి కంటే పద్నాలుగు రెట్లు ఎక్కువ సూక్ష్మక్రిములను కలిగి ఉంటాయి. రీయూజబుల్ వాటర్ బాటిల్స్ ను శుభ్రం చేసేందుకు.. వాటి ద్వారా కలుషితమైన నీటిని తాగకుండా ఉండేందుకు కనీసం రోజుకు ఒకసారి వాటిని శుభ్రపరచాలని శాస్త్రవేత్తలు సిఫార్సు చేశారు.

■ సర్వేలో కీలక విషయాలు

ఈ స్టడీలో భాగంగా 1,000 మంది అమెరికన్లను సర్వే చేసిన తర్వాత, 13% మంది తమ వాటర్ బాటిళ్లను నెలకు కొన్ని సార్లు మాత్రమే శుభ్రం చేస్తారని పరిశోధకులు కనుగొన్నారు. అయితే 88% మంది తమ తాగునీటి నాణ్యత గురించి “లోతుగా శ్రద్ధ వహిస్తారు” అని తేలింది.

★ 1997 నుంచి 2012 మధ్యకాలంలో జన్మించిన వాళ్లు తమ వాటర్ బాటిళ్లను కనీసం శుభ్రం చేస్తారని నివేదికలో పేర్కొన్నారు. 16% మంది తమ బాటిళ్లను నెలలో కొన్ని సార్లు మాత్రమే శుభ్రం చేస్తారు.