Site icon HashtagU Telugu

President Retirement: రాష్ట్రపతికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవే

Kovind Imresizer

Kovind Imresizer

దేశ ప్రథమ పౌరుడిగా ఐదేళ్ల పదవీకాలం పూర్తిచేసుకుని రామ్‌నాథ్ కోవింద్ రిటైరయ్యారు. సోమవారం కొత్త రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రే ప్రధాని నరేంద్ర మోదీ కోవింద్‌ కోసం ప్రత్యేకంగా వీడ్కోల విందు ఏర్పాటుచేశారు. కోవింద్ దంపతులతోపాటు నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్రమంత్రులతోపాటు బీజేపీ, NDA పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు ప్రతిపక్ష నేతలు దీనికి హాజరయ్యారు.

రిటైర్‌మెంట్ తర్వాత రామ్‌నాథ్ కోవింద్‌ రాష్ట్రపతి భవనం ఖాళీ చేసి..12 జన్‌పథ్‌కు వెళ్లిపోయారు. కేంద్రం ఆయనకు ఈ భవనాన్ని కేటాయించింది. ఈ బంగ్లాలో దివంగత కేంద్రమంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ రెండు దశాబ్దాలకుపైగా ఉన్నారు. ఇటీవలే కోవింద్ కుమార్తె స్వాతి కోవింద్‌ బిల్డింగ్‌లో తమకు అనుకూలంగా మార్పులు, చేర్పులు చేయించుకున్నారు. ఇప్పటికే సామాన్ల తరలింపు పూర్తయ్యింది.

పదవీ విరమణ తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పొరుగింట్లో కోవింద్ దంపతులు ఉంటారు. పదవీ విరమణ చేసిన రాష్ట్రపతికి పెన్షన్‌తోపాటు పలు రకాల బెనిఫిట్స్ లభిస్తాయి. నెలకు రూ.1.5 లక్షలు పింఛనుగా అందుతుంది. దీంతోపాటు సెక్రటేరియల్ సిబ్బందికి, ఆఫీస్‌ ఖర్చులకు నెలకు 60వేలు ఇస్తారు. మాజీ రాష్ట్రపతి సతీమణిగా సవితా కోవింద్‌కు కూడా 30వేలు ఖర్చుల కోసం ఇస్తారు.

అంతేకాదు ప్రభుత్వ బంగ్లాకు అద్దె ఉండదు. విద్యుత్, నీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. రెండు ల్యాండ్‌లైన్లు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్‌ ఇస్తారు. 24/7 డ్రైవర్‌తోపాటు కారు కూడా అందుబాటులో ఉంటుంది. కారు వద్దనుకుంటే ట్రావెల్ అలవెన్స్‌ లభిస్తుంది.మాజీ రాష్ట్రపతి హోదాలో రామ్‌నాథ్ కోవింద్‌కు వైద్య సౌకర్యాలు పూర్తిగా ఉచితం. రైలు, విమాన ప్రయాణం కూడా ఫ్రీనే. మాజీ రాష్ట్రపతితోపాటు మరో వ్యక్తికి ఈ ఉచిత సౌకర్యం లభిస్తుంది. ఐదుగురు వ్యక్తిగత సిబ్బంది ఉంటారు. ఢిల్లీ పోలీసుల భద్రత కల్పిస్తారు. భారత మాజీ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్‌కు జీవితకాలం ఈ సౌకర్యాలు అందుతాయి.

Exit mobile version