India: దేశవ్యాప్తంగా స్ట్రైక్ ను విరమించుకున్న డాక్టర్లు

  • Written By:
  • Updated On - December 31, 2021 / 05:26 PM IST

నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌ 2021ను వెంటనే చేపట్టాలంటూ ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో రెసిడెంట్‌ వైద్యులు ఫెడరేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌(ఎఫ్‌వోఆర్‌డీఏ) ఆధ్వర్యంలో నెల రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి మాన్సుఖ్ మాండవీయ తో చర్చల అనంతరం ఆందోళనను విరమించుకొని యధావిధిగా విధులను ప్రారంభించారు.

నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌ను 2019లో నిర్వహించాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యమైంది. తీరా లాక్ డౌన్ తర్వాత నిర్వహించే సమయానికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్థికంగా వెనకపడిన వర్గాల రేజర్వేషన్లను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో కేసు దాఖలైన నేపథ్యంలో ఆ కేసు తీర్పు వెలువడే అంతవరకు నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌ పై స్టే విధించారు. దీంతో దాదాపు మూడు సంవత్సరాలుగా కొత్త వైద్యులు చేరక పోయేసరికి ప్రస్తుతం ఉన్న డాక్టర్ల పై తీవ్రంగా ఒత్తిడి పెరిగింది. నేడు జరిగిన చర్చల్లో ఆరోగ్యమంత్రి జనవరి ఆరు తర్వాత సుప్రీం కోర్టు పర్మిషన్ అడిగి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని హామీ ఇవ్వడంతో వైద్యులు తాత్కాలికంగా ఆందోళనను విరమించుకున్నారు.

అంతే కాకుండా ఆందోళన సమయంలో వైద్యులపై పోలీసులు జరిపిన దాడులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని.. నిరసనకారులపై నమోదైన కేసులు అన్ని కొట్టివేయాలని ఎఫ్‌వోఆర్‌డీఏ సభ్యలు డిమాండ్ చేశారు వారికీ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్)కూడా మద్దతును తెలిపింది. పోలీసులు తమపై లాఠీచార్జి చేశారని వైద్యులు ఆరోపించారు. మహిళా వైద్యులనూ పురుష పోలీసులు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురిని పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నట్టు వెల్ల‌డించారు. పోలీసులు ప్ర‌వ‌ర్తించిన తీరును ఖండించిన వైద్యులు.. ఈ ఘటనకు నిరసనగా బుధవారం దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేయాలని రెసిడెంట్‌ వైద్యులు పిలుపునిచ్చింది. ఈ ఘటన పైనే పోలీసులు క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి తో చర్చల్లో డిమాండ్ చేశారు.