Republic Day Parade : రిపబ్లిక్ డే పరేడ్‌లో వారికి నో ఎంట్రీ..?

రిపబ్లిక్ డే పరేడ్‌కు హాజరయ్యే వ్యక్తులు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకుని ఉండాల‌ని.. 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల‌ను ప‌రేడ్ కు అనుమ‌తి లేద‌ని ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

  • Written By:
  • Publish Date - January 24, 2022 / 02:45 PM IST

రిపబ్లిక్ డే పరేడ్‌కు హాజరయ్యే వ్యక్తులు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకుని ఉండాల‌ని.. 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల‌ను ప‌రేడ్ కు అనుమ‌తి లేద‌ని ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. జనవరి 26న రాజ్‌పథ్‌లో జరిగే కార్యక్రమంలో ప్రజలు ఫేస్ మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరాన్ని నిర్వహించడం వంటి అన్ని కోవిడ్ ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండాలని పోలీసులు తెలిపారు. ప‌రేడ్ కి వ‌చ్చే సందర్శకులు తమ టీకా సర్టిఫికేట్ తీసుకురావాలని ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేశారు. గత ఏడాది జనవరి 16న ఆరోగ్య సంరక్షణ, ఫ్రంట్‌లైన్ కార్మికులతో ప్రారంభించిన జాతీయ కోవిడ్ టీకా కార్యక్రమం క్రమంగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఇప్పుడు పూర్త‌యింది. ఈ నెల నుండి 15-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించారు. ఓమిక్రాన్‌ వేరియంట్ కారణంగా కేసుల పెరుగుతుండ‌టంతో ప్రికాషిన్ డోస్ ని సీనియ‌ర్ సిటీజ‌న్ ల‌కు, అనారోగ్యంతో ఉన్న‌వారికి అందిస్తున్నారు.

రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా ఉదయం 7 గంటలకు సందర్శకులు త‌మ‌కు కేటాయించిన సీట్ల‌లో కూర్చోవాల‌ని పోలీసులు తెలిపారు.పార్కింగ్ ప‌రిమిత సంఖ్య‌లో ఉండ‌టం వ‌ల్ల సంద‌ర్శ‌కులు ట్యాక్సీల‌ను వినియోగించాల‌ని పోలీసులు కోరారు. ప‌రేడ్ కి హాజ‌ర‌య్యే వారు ఏదైనా గుర్తింపు కార్డును తీసుకెళ్లాలని.. భద్రతా తనిఖీ సమయంలో సహకరించాలని కోరారు. దేశ రాజధానిలో 27,000 మంది పోలీసుల‌తో భ‌ద్ర‌తాను ఏర్పాటు చేసిన‌ట్లు ఢిల్లీ పోలీస్ క‌మిష‌న‌ర్ రాకేష్ అస్తానా తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని ఉగ్ర‌దాడులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని .. ఈ నేప‌థ్యంలో భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ సిబ్బందిలో డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్, అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సిఎపిఎఫ్) జవాన్‌లను కూడా మోహరించినట్లు ఆయన చెప్పారు.

రిపబ్లిక్ డే భద్రతా ఏర్పాట్ల సందర్భంగా పరేడ్ కోసం 71 మంది డిసిపిలు, 213 ఎసిపిలు, 753 మంది ఇన్‌స్పెక్టర్లతో సహా 27,723 మంది ఢిల్లీ పోలీసు సిబ్బందిని రాజధానిలో మోహరించినట్లు అస్థానా తెలిపారు. గత రెండు నెలల్లో ఉగ్రవాద నిరోధక చర్యలు ముమ్మరం చేశామని కమిషనర్ తెలిపారు. ఎయిర్ స్పేస్ సెక్యూరిటీ కోసం కౌంటర్ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నామ‌ని.. గ‌ణ‌తంత్ర‌ దినోత్సవ వేడుకలు జరిగే ప్రాంతం, చుట్టుపక్కల భద్రతను కూడా ఢిల్లీ పోలీసులు, ఇతర ఏజెన్సీల సహాయంతో త‌నిఖీలు చేస్తున్న‌ట్లు ఆస్తానా తెలిపారు. సాధారణ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నామ‌ని క‌మిష‌న‌ర్ తెలిపారు.