Republic Day 2025 : రిపబ్లిక్ డే సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో అట్టహాసంగా, అంగరంగ వైభవంగా పరేడ్‌ను నిర్వహించారు. దేశ చరిత్రలో తొలిసారిగా 100 మంది మహిళలు శంఖం, నాదస్వరం వంటి సంప్రదాయ సంగీత వాయిద్యాలను వాయిస్తూ కర్తవ్యపథ్‌లో పరేడ్‌ను ప్రారంభించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లలో నారీ శక్తికి ప్రాతినిధ్యం వహిస్తూ మహిళా అధికారులు లెఫ్టినెంట్ కర్నల్ రవీందర్‌జీత్ రంధావా, లెఫ్టినెంట్ కమాండర్ మణి అగర్వాల్, ఫ్లైట్ లెఫ్టినెంట్ రుచి సాహా, కెప్టెన్ సంధ్యా మహ్లా దీనిలో పాల్గొన్నారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీఓ) నిర్వహించిన కవాతుకు మహిళా శాస్త్రవేత్త సునీతా జెనా నాయకత్వం వహించారు. అధునాతన రక్షణ సాంకేతికతల ద్వారా దేశ భద్రతను బలోపేతం చేయడంలో అతివలు అందించిన కీలకమైన సహకారాన్ని అందులో ప్రదర్శించారు.
Also Read :Tik Tok Race : టిక్‌టాక్ కొనుగోలు రేసులో యూట్యూబర్, సాఫ్ట్‌వేర్ కంపెనీ
ప్రదర్శించిన మిస్సైళ్లు, రాకెట్లు, యుద్ధ ట్యాంకులు ఇవే..
అసిస్టెంట్ కమాండెంట్ ఐశ్వర్య జాయ్ నేతృత్వంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన 148 మంది సభ్యుల మహిళా బృందం, డివిజనల్ సెక్యూరిటి కమిషనర్ ఆదిత్య నేతృత్వంలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బృందం పరేడ్‌లో(Republic Day 2025) పాల్గొన్నాయి. సుమారు 15మంది మహిళా పైలట్ల బృందం ఫ్లై పాస్ట్‌లో తమ ప్రతిభను చూపారు. మొత్తం మీద ఈ వేడుకల్లో వికసిత భారత్, నారీ శక్తి అంశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ‘స్వర్ణిమ్ భారత్, విరాసత్ ఔర్ వికాస్’ అనే థీమ్‌తో శకటాలను రూపొందించారు. ఇందులో భారత త్రివిధ దళాలు సత్తాచాటాయి. తమ శక్తిని యావత్ ప్రపంచానికి చూపించాయి. ‘సశక్త్ ఔర్ సురక్షిత్ భారత్’ అనే థీమ్‌తో త్రివిధ దళాలు సంయుక్తంగా శకటాన్ని ప్రదర్శించాయి. బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణులు, పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టీ-90 యుద్ధట్యాంక్ (భీష్మ), బీఎంపీ-2 శరత్‌తో పాటు నాగ్, బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థలు, పినాక, అగ్నిబాణ్ మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్లు, ఆకాశ్ వెపన్ సిస్టమ్, చేతక్, బజరంగ్, ఐరావత్ సహా పలు ఆయుధాలను ప్రదర్శించారు. ఈ పరేడ్‌లో 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన శకటాలు సందడి చేశాయి.
Also Read :Most Wanted Criminals : భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టాప్-5 నేరగాళ్లు ఎవరో తెలుసా ?
152 మంది ఇండోనేషియా నేషనల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ కవాతు
300 మంది కళాకారుల బృందం వివిధ రకాల దేశీయ వాయిద్యాలతో ‘సారే జహాసే అచ్చా’ గీతాన్ని వాయించారు. అనంతరం గగనతలం నుంచి హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. ఇండోనేసియాకు చెందిన నేషనల్ ఆర్మ్‌డు ఫోర్సెస్ నుంచి 152 మంది బృందం కవాతులో పాల్గొంది. మరో 190 మంది సభ్యుల బ్యాండ్ బృందం మార్చ్ నిర్వహించింది.అంతకుముందు రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈసారి గణతంత్ర దినోత్సవాలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన రాష్ట్రపతి ముర్ముతో కలిసి గుర్రపు బండిలో వేదిక వద్దకు చేరుకున్నారు. వేదిక వద్ద భారత సైనిక దళాల గౌరవవందనాన్ని స్వీకరించారు. ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు పాల్గొన్నారు.