Delhi: ఢిల్లీలో తగ్గిన వాయు కాలుష్యం, తెరుచుకున్న పాఠశాలలు

  • Written By:
  • Updated On - November 20, 2023 / 03:35 PM IST

Delhi: దేశ రాజధానిలో తీవ్రమైన వాయు కాలుష్యం దృష్ట్యా నవంబర్ 9 నుండి 18 వరకు పాఠశాలలకు సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలోని పాఠశాలలు సోమవారం తిరిగి తెరవబడ్డాయి. సోమవారం ఢిల్లీలోని గీతా కాలనీ ప్రాంతంలోని పాఠశాలలో తమ తరగతులకు హాజరయ్యేందుకు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ఉదయాన్నే పాఠశాలలకు వచ్చారు. నవంబర్ 20న ఢిల్లీలోని పాఠశాలలు తిరిగి తెరవబడతాయని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించడంతో స్కూళ్లన్నీ ఓపెన్ అయ్యాయి.

కాలుష్య స్థాయిలు గణనీయంగా తగ్గడం, మెరుగైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) కారణంగా పాఠశాలలు తెరవడం జరిగింది. గాలి నాణ్యత తక్కువగా ఉన్నందున ఈ నెల ప్రారంభంలో విద్యా డైరెక్టరేట్ నవంబర్ 9-18 వరకు సెలవులను ప్రకటించింది. కాలుష్య స్థాయిలు పెరుగుతున్న దృష్ట్యా 10, 12 తరగతులు మినహా అన్ని పాఠశాలల్లో తరగతులను నవంబర్ 10 వరకు నిలిపివేయాలని ఆదేశించినట్లు పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ గతంలో ప్రకటించారు. చాలా రోజుల తర్వాత వాయు కాలుష్యం తగ్గడంతో ఢిల్లీలో మళ్లీ స్కూళ్ల సందడి మొదలైంది.