దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం రాత్రి జరిగిన కారు పేలుడు దేశవ్యాప్తంగా కలకలాన్ని రేపింది. సాయంత్రం ఏడుగంటల సమయంలో భారీ శబ్దంతో పేలిన కారు మంటల్లో చిక్కుకొని 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రత అంతగా ఉండటంతో సమీప ప్రాంతాలు కంపించాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రజలు భయంతో ఆ ప్రాంతం నుంచి పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో ఎర్రకోటను అత్యవసరంగా మూడు రోజులపాటు సందర్శకులకు మూసివేస్తున్నట్లు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ప్రకటించింది. ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Ande Sri Padma Shri Award : అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కోరతాం – సీఎం రేవంత్
పేలుడు వెనుక ఉగ్ర లింకులు ఉన్నాయన్న అనుమానం దర్యాప్తు అధికారుల్లో బలపడుతోంది. ప్రాథమిక విచారణలో ఈ ఘటనకు ఫరీదాబాద్ టెరర్ మాడ్యూల్ కు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. కారు పేలుడుకు డిటోనేటర్లు, అమోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలు ఉపయోగించినట్లు నిపుణులు నిర్ధారించారు. ఈ ఘటనను సూసైడ్ బాంబ్ దాడిగా పరిగణిస్తూ విచారణ సాగుతోంది. పేలుడు జరిగే ముందు కారు డ్రైవర్ డాక్టర్ ఉమర్ మహమ్మద్ సుమారు మూడు గంటల పాటు ఆ వాహనాన్ని ఎర్రకోట పార్కింగ్ ఏరియాలో నిలిపినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో బయటపడింది. అతని శరీర భాగాలను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు పుల్వామాకు చెందిన ఉమర్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో నలుగురు అనుమానితులను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్‌ను కూడా భద్రతా కారణాల వల్ల తాత్కాలికంగా మూసివేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష జరుగుతోంది. దేశ రాజధాని హృదయంలో ఇలాంటి ఘోర పేలుడు చోటుచేసుకోవడం దేశ భద్రతా వ్యవస్థకు పెద్ద సవాలుగా మారింది. దర్యాప్తు సంస్థలు ఇప్పుడు ఈ దాడి వెనుక ఉన్న ఉగ్రవాద సంస్థల అంతర్జాతీయ నెట్‌వర్క్‌పై దృష్టి సారించాయి.
