Delhi Fire Follow Up: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదానికి అసలు కారణాలివే.. మృతుల సంఖ్య ఇంకా..!

ఢిల్లీ ఘోర అగ్ని ప్రమాదం వెనుక అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - May 14, 2022 / 12:31 PM IST

ఢిల్లీ ఘోర అగ్ని ప్రమాదం వెనుక అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతుల సంఖ్య 27 కన్నా ఇంకా ఎక్కువే ఉండొచ్చని అంచనా. ఎందుకంటే పోలీసులు ఇంకా ఒక ఫ్లోర్ ని గాలించాల్సి ఉంది. ఈబిల్డింగ్ లోని మొదటి అంతస్తులో ఉన్న సీసీటీవీ కెమెరాలు, రూటర్ల తయారీ కంపెనీ ఆఫీసులో మంటలు చెలరేగాయి. తరువాత ఆ భవనంలో ఉన్న ఇతర ఫ్లోర్లకూ వ్యాపించాయి. ఈ ఘటనతో భయాందోళనలకు గురైన చాలామంది ప్రాణాలు కాపాడుకోవడానికి కిటికీల్లోంచి దూకేశారు. ఇంకొందరు తాడు సాయంతో దిగడానికి ప్రయత్నించారు. దీంతో కొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరికొందరు చనిపోయారు.

అసలీ బిల్డింగ్ కు అగ్నిమాపక శాఖ నుంచి సేఫ్టీ క్లియరెన్సే లేదని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ప్రమాదం తీవ్రత పెరగడంతో బిల్డింగ్ యజమాని మనీష్ లక్రా పరారీలో ఉన్నాడు. మంటలు చెలరేగిన సమయానికి ఈ బిల్డింగ్ లోని రెండో ఆంతస్తులో మోటివేషన్ కార్యక్రమం జరుగుతోంది. దీనికి ఎక్కువమంది రావడంతో ప్రమాదం పెరిగింది. అందుకే మృతుల సంఖ్య కూడా ఎక్కువైంది. పైగా బిల్డింగ్ నుంచి బయటకు వెళ్లడానికి కేవలం ఒక మెట్లు మార్గమే ఉంది. దీంతో ప్రమాద సమయంలో ఎక్కువమంది తప్పించుకోవడానికి వీలులేకుండా పోయింది. అందుకే అక్కడే సజీవ సమాధి అయిపోయారు.

24 ఫైరింజన్లు కృషి చేసినా సరే.. చాలాసేపటి వరకు మంటలు అదుపులోకి రాలేదు. ప్రమాదానికి కారణమైన కంపెనీ యజమానులు హరీష్ గోయెల్, వరుణ్ గోయెల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దుర్ఘటనపై ఇప్పటికే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, ఢిల్లీ సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.