Himachal Pradesh: హిల్‌స్టేట్‌లో బీజేపీ ఓటమికి కారణాలివే

  • Written By:
  • Updated On - December 9, 2022 / 09:29 AM IST

హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh) ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా తీర్పుచెప్పే 27 ఏళ్ల సంప్రదాయాన్నే ఈసారి హిమాచల్‌ ప్రదేశ్‌(Himachal Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటర్లు అనుసరించారు. జైరాం ఠాకూర్‌ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌ అమలుచేస్తున్న అభివృద్ధి పనులను కొనసాగించేలా..మరోసారి కమలం గుర్తుకు ఓటేయాలని ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా రాసిన బహిరంగలేఖను సైతం ఓటర్లు పట్టించుకోలేదు. నిజానికి గత ఏడాది నుంచే బీజేపీ హిమాచల్‌పై ఫోకస్‌ పెంచింది.

గత సంవత్సరం రాష్ట్రంలోని ఒక లోక్‌సభ, 3 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్‌ స్వీప్ చేయడం కమలనాథుల్లో గుబులురేపింది. అధికారపార్టీపై వ్యతిరేకతను పసిగట్టిన బీజేపీ.. నష్టనివారణకు నడుంబిగించింది. మోదీ అయితే ఏకంగా ఎయిమ్స్‌తోపాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. గతంలోని ప్రభుత్వాలు శంకుస్థాపనలకే పరిమితమైతే.. బీజేపీ అధికారంలోకి వచ్చాక మాత్రమే అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరాయని ప్రధాని గుర్తుచేసినా ఓటర్లు పట్టించుకోలేదు. మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా కూడా వరుస టూర్లతో రాష్ట్రంలో ప్రచారంచేసినా ప్రతికూల ఫలితాలు తప్పలేదు.

హిమాచల్‌లోని బీజేపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఎన్నికలనాటికి మరింత తీవ్రమైంది. నిత్యావసరవస్తువుల ధరలు పెరగుదలపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత ఆపార్టీకి కలిసిరాలేదు. దీనికితోడు సైన్యంలో ప్రవేశాలకు కొత్తగా కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌ను యువత వ్యతిరేకించింది. అగ్నిపథ్‌తో సైన్యంలో చేరే అవకాశాలు తగ్గిపోతాయని భావించే యువ ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని కూడా విశ్లేషిస్తున్నారు.

Also Read: Murder In Delhi : ఢిల్లీలో దారుణం..ప్రియుడితో క‌లిసి భర్తను హత్య చేసిన భార్య

హిమాచల్‌లో యాపిల్‌ పంటను సాగుచేసే రైతులు, వ్యాపారులు కూడా ప్రభుత్వ విధానాలపై గుర్రుగా ఉన్నారు. సాగు కోసం వాడే పురుగుల మందులకు ఇచ్చే సబ్సిడీని బీజేపీ ప్రభుత్వం ఆపేసింది. పండిన పంటలకూ గిట్టుబాటు ధరలేదని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. పెద్ద పెద్ద కంపెనీలు కూడా యాపిల్‌ మార్కెటింగ్‌పై ఆధిపత్యం చెలాయిస్తున్నాయని రైతులు, వ్యాపారులు మండిపడ్డారు. దాదాపు 30 నియోజకవర్గాల్లో గెలుపోటముల్ని యాపిల్‌ రైతులు, వ్యాపారుల ప్రభావితం చేశారని కూడా అంచనావేస్తున్నారు.

సంకల్ప్‌ వ్రత్‌ పేరుతో విడుదల చేసిన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫలమైందని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఏకీకృత పౌర చట్టాన్ని అమలుచేస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామని, కొత్తగా 8 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీలు కూడా బీజేపీని ఓటమి నుంచి కాపాడలేకపోయాయని వారన్నారు. హిమాచల్ లో అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ గట్టిగా కష్టపడినా లాభంలేకపోయింది. ఐదేళ్లకోసారి అధికారం మారే ఆనవాయితీని తిరగరాయలని భావించినా కుదరలేదు. గుజరాత్‌లో ఘన విజయం సాధించినా హిమాచల్‌లో ఎందుకు ఓడిపోవాల్సి వచ్చేందో పోస్ట్‌మార్టం చేసేందుకు బీజేపీ అధిష్ఠానం రెడీ అవుతోంది.