Renuka Chaudhary: కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి (Renuka Chaudhary) సోమవారం పార్లమెంటు ఆవరణలోకి ఒక కుక్కపిల్లను తీసుకురావడంపై తీవ్ర చర్చ జరిగింది. ఇతర ఎంపీల అభ్యంతరాలను ఆమె తోసిపుచ్చారు. “నిజమైన కుక్కలు పార్లమెంట్‌లో కూర్చుని, ప్రతిరోజూ ప్రజలను కరుస్తున్నాయి” అని ఆమె వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది.
కుక్కపిల్లను తీసుకొచ్చిన కారణం
తాను పార్లమెంట్‌కు వస్తున్న మార్గంలో ఆ కుక్కపిల్లను రక్షించానని రేణుకా చౌదరి వివరించారు. దారిలో స్కూటర్-కారు ఢీకొన్న ఘటనను చూశానని, ఆ సమయంలో ఆ కుక్కపిల్ల రోడ్డుపై తిరుగుతోందని చెప్పారు. దానికి ప్రమాదం జరగకుండా చూసేందుకు దాన్ని తన కారులో తీసుకువచ్చానని, అది తన వాహనంలోనే ఉండి, ఆమె దిగిన కొద్దిసేపటికే తిరిగి వెళ్లిపోయిందని తెలిపారు.
“దీని గురించి ఏదైనా చట్టం ఉందా? నేను వస్తున్న దారిలో స్కూటర్, కారు ఢీకొన్నాయి. ఈ చిన్న కుక్కపిల్ల రోడ్డుపై తిరుగుతోంది. దానికి చక్రం తగులుతుందేమోనని అనుకున్నాను. అందుకే దాన్ని తీసుకుని కారులో పెట్టుకుని, పార్లమెంట్‌కు వచ్చి తిరిగి పంపించేశాను. కారు వెళ్లిపోయింది. కుక్క కూడా వెళ్లిపోయింది. మరి ఈ చర్చ దేనికి?” అని రేణుకా చౌదరి ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు.
Also Read: Wedding : పెళ్లి వేదికపై వరుడికి షాక్ ఇచ్చిన పెళ్లి కూతురు
పాలకపక్షంపై విమర్శలు
NDA ఎంపీల పేరు చెప్పకుండా రేణుకా చౌదరి పాలక పక్షంపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. “నిజంగా కరిచేవాళ్లు పార్లమెంట్‌లో కూర్చుని ఉన్నారు” దాని గురించి ఎలాంటి చర్చ జరగడం లేదని ఆమె అన్నారు. “నిజంగా కరిచేవాళ్లు పార్లమెంట్‌లో కూర్చుని ఉన్నారు. వాళ్లే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మూగ జంతువును మేం చూసుకుంటే ఇదే పెద్ద సమస్యగా, చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వానికి చేయడానికి వేరే పనే లేదా? నేను ఆ కుక్కను ఇంటికి పంపించి, అక్కడే ఉంచమని చెప్పాను. ప్రతిరోజూ పార్లమెంట్‌లో కూర్చుని మమ్మల్ని కరిచే వాళ్ల గురించి మేం మాట్లాడడం లేదు” అని ఆమె ఘాటుగా స్పందించారు.
మరోవైపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, ముఖ్యంగా లోక్‌సభలో దేశవ్యాప్తంగా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు పదేపదే నినాదాలు, నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతిపక్షం సభలో “ఓట్ చోర్, గద్దీ చోడ్” (ఓటు దొంగ, గద్దె దిగు) అనే నినాదాలు లేవనెత్తింది. దీంతో స్పీకర్ స్థానంలో ఉన్న ఎంపీ సంధ్యా రాయ్ సభను వాయిదా వేశారు.
