DK Shivakumar : 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికిస్తూ ఐపీఎల్ ట్రోఫీని ఎట్టకేలకు రాయల ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కైవసం చేసుకున్న నేపథ్యంలో, బెంగళూరు నగరం సంబరాల జోరులో మునిగిపోయింది. విజయోత్సవ ర్యాలీ కోసం అభిమానులు తీవ్రంగా ఎదురుచూస్తున్న వేళ.. RCB జట్టు గెలుపు వేడుకలు, విజయర్యాలీపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ బుధవారం స్పష్టం చేశారు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌పై సంచలన విజయం సాధించిన అనంతరం, విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జట్టు బుధవారం బెంగళూరుకు చేరుకుంటోంది.
ఇవాళ జరగనున్న విజయర్యాలీకి సంబంధించి ఇప్పటికే జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకుందని సమాచారం. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య, విధానసౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ర్యాలీ జరగనుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
విజయం అనంతరం దేశవ్యాప్తంగా అభిమానం ఉరకలెత్తింది. ఇప్పుడు దృష్టి మొత్తం బెంగళూరుపై పడింది. వేలాది మంది అభిమానులు తమ అభిమాన జట్టుకు గ్రాండ్ వెల్‌కమ్ ఇవ్వేందుకు సిద్ధమవుతున్నారు.
విజయోత్సవాల్లో క్రికెట్ దిగ్గజాలు ఏబీ డివిల్లియర్స్, క్రిస్ గేల్ కూడా పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో RCB జట్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. “RCB మన గర్వకారణం. వారి గెలుపు కర్ణాటక ప్రజల గర్వాన్ని పెంచింది. మ్యాచ్‌లో ప్రతి క్షణాన్ని నేను చూశాను. ప్రభుత్వ తరపున, ప్రజల తరపున వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. తగిన విధంగా వారికి గౌరవ వందనం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో పోలీస్ అధికారులతో పాటు మేము చర్చలు జరుపుతున్నాం” అని పేర్కొన్నారు.
“ఇంకా ర్యాలీకి సంబంధించిన సమయాన్ని, ప్రదేశాన్ని, ఏర్పాట్లను తుది నిర్ణయంగా తీసుకోలేదు. హోం మంత్రి, బెంగళూరు పోలీస్ కమిషనర్‌తో చర్చించాలి. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలి. అలాగే ఆటగాళ్లకు కూడా గౌరవం దక్కాలి” అని ఆయన స్పష్టం చేశారు.
Damodara Raja Narasimha : ఫుడ్ పాయిజన్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది