Agriculture Loans : అన్నదాతలకు గుడ్ న్యూస్. తాకట్టు లేకుండా రైతులకు బ్యాంకులు మంజూరు చేసే లోన్ లిమిట్ పెరిగింది. ఇంతకుముందు తాకట్టు లేకుండా రైతులకు రూ.1.60 లక్షల దాకా లోన్‌ను బ్యాంకులు మంజూరు చేసేవి. 2025 జనవరి 1 నుంచి తాకట్టు లేకుండా రూ.2 లక్షల దాకా లోన్‌ను రైతులకు బ్యాంకులు మంజూరు చేయనున్నాయి. ఈమేరకు బ్యాంకింగ్ నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సవరించింది. ఎరువులు, విత్తనాలు, కూలీల వేతనాలు, వ్యవసాయ పరికరాలు వంటి వాటి ధరలన్నీ(Agriculture Loans) పెరిగిపోయాయి. ఈ కారణం వల్లే లోన్ లిమిట్‌ను పెంచినట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఎంతోమంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
Also Read :Presidents Impeachment : అధ్యక్షుడు ఔట్.. అభిశంసన తీర్మానం పాస్.. అధికార, విపక్షాలు ఏకం
తాకట్టు లేకుండానే రైతులకు లోన్ మంజూరు చేయాలని నిబంధనను దేశంలోని బ్యాంకులు ఫాలో కావడం లేదు. సదరు భూమి యజమాని నుంచి పూచీకత్తు లభిస్తేనే వ్యవసాయ లోన్‌ను మంజూరు చేస్తున్నాయి. పూచీకత్తు ఇవ్వని రైతుల రుణ దరఖాస్తులను స్వీకరించడం లేదు. ఆర్‌బీఐ లాంటి అత్యున్నత సంస్థ మార్గదర్శకాలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోకపోవడం శోచనీయం. అయినా దీనిపై పార్లమెంటులో గొంతెత్తే నాథుడు కనిపించడం లేదు. కనీసం విపక్ష పాలిత రాష్ట్రాలు కూడా దీనిపై గళమెత్తడం లేదు. అన్ని రాష్ట్రాల్లోనూ రాజకీయ విమర్శలు, ఆరోపణలే పతాక స్థాయిలో నిలుస్తున్నాయి. రైతుల సంక్షేమానికి సంబంధించిన ఇలాంటి అంశాలపై నోరువిప్పే వారు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో దేశంలోని రైతులు ప్రైవేటు వడ్డీవ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకొని విలవిలలాడుతున్నారు. పంటసాగుకు పెట్టుబడి అవసరమైనప్పుడల్లా రైతన్నలు.. వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి అప్పులు తీసుకుంటున్నారు. ఆ విష వలయంలో చిక్కుకొని.. ఎంతోమంది అన్నదాతలు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు.