రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత్ దాస్ ఛాతి నొప్పి కారణంగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరినట్లు ఆర్‌బీఐ అధికార ప్రతినిధి తెలిపారు. సాధారణంగా, ఛాతి నొప్పి అనగానే గుండె సంబంధిత సమస్యలే మనసులో వస్తాయి. కానీ ఈసారి శక్తికాంత్ దాస్ కు ఎసిడిటీ (ఆమ్లతుల రిఫ్లక్స్) కారణంగా ఛాతి నొప్పి వచ్చిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ విషయం చూస్తుంటే, ఎసిడిటీ వల్ల కూడా ఛాతి నొప్పి వస్తుందా? మరియు దీన్ని ఎలా గుర్తించాలో అన్న సందేహం చాలా మంది మనసులో మెలగింది.
ఒడిశాలో జన్మించిన శక్తికాంత్ దాస్ ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 25వ గవర్నర్‌గా సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని, మరో రెండు మూడు గంటల్లో డిశ్చార్జ్ అవుతారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ఎసిడిటీ లేదా యాసిడ్ రిఫ్లక్స్ అనేది అహారపదార్థాలు కడుపులోని ఆమ్లంతో రిఫ్లక్సై కడుపు నుండి అన్నవాహికలోకి తిరిగి ప్రవహించే పరిస్థితి. ఇది గుండెల్లో మంట, వికారం, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలను కలిగిస్తుంది. దీన్ని ఆరోగ్యకరమైన జీవనశైలితో బయటపడవచ్చు లేదా మందులతో కూడా నివారించొచ్చని వెల్లడించారు. అయితే ఒక్కోసారి తీవ్రమైన సందర్భాల్లోనే ఇలా ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు నిపుణులు.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ హిస్టరీ:
శక్తికాంత దాస్ ఒడిశా భువనేశ్వర్‌లో 1957, ఫిబ్రవరి 26న జన్మించారు. ఉర్జిత్ పటేల్ రాజీనామా తర్వాత.. ఆయన స్థానంలో శక్తికాంత దాస్‌ను ఆర్బీఐ గవర్నర్‌గా నియమించింది. ఈ సమయంలో ఆయన చదువుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎంఏ హిస్టరీ చదివిన ఆయనను.. ఆర్బీఐ గవర్నర్‌గా ఎలా నియమిస్తారని రాజకీయ నాయకులు కూడా విమర్శలు గుప్పించారు. నిజానికి అంతకుముందు వారంతా అర్థశాస్త్రంలో పండితులు కాగా.. దాస్ చరిత్ర (హిస్టరీ) చదివారు. అయినా ఆయన తన పనితీరుతో కొన్నేళ్లలోనే విమర్శకులకు సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే వరుసగా రెండోసారి ప్రపంచ అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్‌గా ఆర్బీఐ గవర్నర్ దాస్ ఎంపికయ్యారు.
అమెరికా గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఇచ్చిన ర్యాంకుల్లో ఆయనకు 2024లో అగ్రస్థానం దక్కింది. శక్తికాంత దాస్‌కు ఏ ప్లస్ రేటింగ్ లభించిందని ఆర్బీఐ స్వయంగా ట్విట్టర్‌లో పేర్కొంది. ఈ A+ రేటింగ్ మొత్తం ముగ్గురు కేంద్ర బ్యాంక్ గవర్నర్లకు లభించగా.. అందులో దాస్ ఒకరు. ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలు, ఆర్థిక స్థిరత్వం, వడ్డీ రేట్ల నిర్వహణ, ద్రవ్యోల్బణం అంశాల ఆధారంగా .. కేంద్ర బ్యాంక్ గవర్నర్లకు ఏ నుంచి F వరకు గ్రేడ్స్ ఇచ్చారు. ఇక ఆర్బీఐని సమర్థంగా నిర్వహిస్తున్న శక్తికాంత దాస్‌కు ఈ అవార్డు వరించింది. ఇక ఇటీవల శక్తికాంత దాస్‌పై కూడా డీప్‌ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.