Rashtrapati Bhavan: ‘రాష్ట్రపతి భవన్‌’ ను మనమూ చూడొచ్చు!

డిసెంబరు 1 నుంచి వారానికి అయిదు రోజుల పాటు రాష్ట్రపతి భవన్‌ సందర్శకుల‌కు అందుబాటులోకి రానుంది.

Published By: HashtagU Telugu Desk
President Bhavan

President Bhavan

డిసెంబరు 1 నుంచి వారానికి అయిదు రోజుల పాటు రాష్ట్రపతి భవన్‌ సందర్శకుల‌కు అందుబాటులోకి రానుంది. ప్రభుత్వ సెలవు రోజులు మినహా బుధ, గురు, శుక్ర, శని, ఆదివారాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు రాష్ట్రపతి భవన్‌ను  సందర్శించవ‌చ్చు. అదేవిధంగా మంగళవారం నుంచి ఆదివారం వరకు వారానికి ఆరు రోజులు రాష్ట్రపతి భవన్‌ మ్యూజియం కాంప్లెక్స్‌ను కూడా ప్ర‌జ‌లు సందర్శించవచ్చు. ఈ మేర‌కు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ అధికార వ‌ర్గాలు ఉత్త‌ర్వులు జారీ చేశాయి.

రాష్ట్రపతి భవన్ న్యూ ఢిల్లీలో ఉన్న భారత రాష్ట్రపతి అధికారిక నివాసం. ఇది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ స్మారక కట్టడాలలో ఒకటిగా ఉంది. ఇందులో ఉద్యానవనాలు మ్యూజియం సెరిమోనియల్ హాల్ భారీ సమావేశాలు నిర్వహించుకోవడానికి వీలుగా హాళ్లు అంగరక్షకులు సిబ్బంది నివాసం మొదలైనవి ఉన్నాయి. అలాగే ఇది విస్తీర్ణం పరంగా దేశంలోనే అతిపెద్ద దేశాధినేత నివాసం కావడం విశేషం.

1912 నుంచి 1929 మధ్యకాలంలో రాష్ట్రపతి భవన్ నిర్మించారు. అంటే దాదాపు 17ఏళ్ల పాటు నిర్మాణం సాగింది. దీనికోసం అప్పట్లోనే కోటీ 40 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు టాక్. ఇందులో మొదట లార్డ్ ఎర్విన్ వైస్రాయ్ కుటుంబం నివసించారు. స్వాతంత్య్రం తర్వాత 1950లో ఈ భవనాన్ని రాష్ట్రపతి భవన్ గా మార్చారు.

  Last Updated: 22 Nov 2022, 12:40 PM IST