గోల్డ్ అక్రమ రవాణా కేసు(Gold Smuggling Case)లో ప్రధాన నిందితురాలిగా ఉన్న నటి రన్యా రావు (Ranya Rao) సన్నిహితుడు తరుణ్ రాజ్ (Tarun Raj) ను అరెస్ట్ చేశారు. రన్యారావు ను ప్రత్యేక కోర్టులో హాజరైనపుడు కన్నీటి పర్యంతమైంది. డీఆర్‌ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు ఆమెను కోర్టుకు హాజరుపరచగా.. న్యాయమూర్తి విశ్వనాథ్ సి. గౌడర్ ఆమెపై ప్రశ్నలు వేసినప్పుడు, రన్యా తనపై తీవ్ర మానసిక ఒత్తిడి తెచ్చారని వాపోయారు. అధికారుల మాటలతో భయపెట్టారని, శారీరక వేధింపులు చేయకపోయినా, విచారణ సమయంలో తీవ్ర ఒత్తిడికి గురిచేశారని ఆమె కోర్టుకు వివరించారు. అయితే డీఆర్‌ఐ అధికారులు రన్యా ఆరోపణలను ఖండిస్తూ, విచారణ నిబంధనల ప్రకారం సాగిందని, ప్రతిక్షణం వీడియో రికార్డ్ చేయబడిందని స్పష్టం చేశారు.
Congress : కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమైపోతున్నది – కేటీఆర్
రన్యా రావు బంగారు స్మగ్లింగ్ సిండికేట్‌కు భాగస్వామి అని , వరుసగా విదేశాలకు ప్రయాణాలు చేయడం, అక్కడి నుంచి బంగారు కడ్డీలు అక్రమంగా రవాణా చేయడంపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. విచారణలో కీలకమైన ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఆమె నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఈ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. బెంగళూరులోని ప్రముఖ హోటల్ అట్రియా ఓనర్ మనవడు తరుణ్ రాజ్‌ను డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తరుణ్ రాజ్, రన్యా రావు ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా ఉండేవారని, విదేశాల నుంచి బంగారం అక్రమంగా రవాణా చేయడంలో ఇద్దరూ కలిసి పనిచేశారని అధికారులు అనుమానిస్తున్నారు. రన్యా పెళ్లి అనంతరం వీరిద్దరి మధ్య సంబంధాలు సడలినా, ఇటీవల దుబాయ్ నుంచి బంగారం రవాణా చేసే సమయంలో మళ్లీ తరుణ్ రాజ్‌తో ఆమె సంప్రదింపులు జరిపినట్లు గుర్తించారు. ఇది తరుణ్ అరెస్టుకు ప్రధాన కారణమైందని డీఆర్‌ఐ వెల్లడించింది.