Site icon HashtagU Telugu

BJP : బిజెపి ఆత్మ రూపం రమేష్ బిధూరి

Ramesh Bidhuri Is The Soul Of Bjp (1)

Ramesh Bidhuri Is The Soul Of Bjp (1)

డా. ప్రసాదమూర్తి

బిజెపి అంతరాత్మకు అద్దం పడితే అది రమేష్ బిధూరి (Ramesh Bidhuri)లా ఉంటుందని చెప్తే అతిశయోక్తి కాదేమో. ఇటీవల కొత్త పార్లమెంటు భవనం(New Parliament Building)లో తోటి పార్లమెంటు సభ్యుడిని ఉగ్రవాది అని ఆతంకవాది అని సంబోధించి బిజెపి ఎంపీ రమేష్ విధూరి వార్తల్లోకి ఎక్కిన అద్భుతాన్ని దేశం మర్చిపోలేదు. రాజ్యాంగం సాక్షిగా, ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, ఇతర అధికారపక్ష సభ్యుల సమక్షంలో ప్రతిపక్షాలు నివ్వెర పోయేటట్టు రమేష్ బిధూరి రెచ్చిపోయిన ఘటన అది. దీనిపై కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అగ్ర నాయకత్వం ఎలాంటి చర్య తీసుకుంటుందా అని ప్రతిపక్షాలతో సహా దేశమంతా ఎదురుచూస్తోంది. కనీసం అంతరాత్మలో లేకున్నా, దేశం కోసం అయినా రమేష్ బిధూరి మీద చర్య తీసుకుని చేతులు దులుపుకునే పని బీజేపీ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అలా చేస్తే అది బిజెపి ఎలా అవుతుంది? బిజెపి అందరూ అనుకున్న దానికి విరుద్ధంగా విపరీతంగా చర్యలు తీసుకుంది. అది రమేష్ బిధూరి వ్యతిరేక చర్య కాదు. అతనికి ప్రమోషన్ ఇచ్చి గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించి దేశానికి బిజెపి ఒక సందేశాన్ని ఇచ్చింది. రమేష్ బిధూరి తమ పార్టీ అసలైన ప్రతినిధి అని తేల్చి చెప్పింది.

అసలే ఎన్నికలు దగ్గర పడుతున్న కాలం. ఈ సమయంలో కంటి తడుపు గానైనా రమేష్ బిధూరి ముస్లిం మైనారిటీల మీద విషం కక్కిన వైనాన్ని ఖండించి అతనిపై చర్య తీసుకుంటుంది అని అనుకుంటే అది మన అజ్ఞానమే. రమేష్ బిధూరి తమ పార్టీ అంతరాత్మకు అధికార ప్రతినిధిగా బిజెపి దేశానికి చెప్పదలుచుకుంది. రాజస్థాన్ ఎన్నికలలో టోంక్ నియోజకవర్గానికి రమేష్ బిధూరిని ఎన్నికల ఇన్చార్జిగా చేసి తమ పార్టీ విధానమే విద్వేషమని నిరూపించుకుందని పలువురు మేధావులు, రాజకీయ విశ్లేషకులు, నేషనల్ మీడియా మొత్తం విమర్శలు గుప్పిస్తున్నారు. పార్లమెంటు సాక్షిగా దేశంలో ఒక ముఖ్యమైన అంగంగా ఉన్న ముస్లిం మైనారిటీలపై విషంగక్కిన తీరు ఎవరూ మర్చిపోలేనిది. పైగా ఆయన ఆ విషయంపై ఎక్కడా పశ్చాత్తాపం ప్రకటించలేదు. బీఎస్పీ ఎంపీ దానిష్ అలీపై రమేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్యలను స్పీకర్ దృష్టికి తీసుకువచ్చి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా అందరూ కోరారు. కానీ దీనికి వ్యతిరేకంగా బిజెపి వారు అతన్ని ఏకంగా రాజస్థాన్లో ఒక నియోజకవర్గానికి ఎన్నికల ఇన్ ఛార్జిగా చేయడం పట్ల అందరికీ ఆశ్చర్యం కలిగింది. టోంక్ నియోజకవర్గంలో 40 శాతం పైన ముస్లింలు ఉన్నారు. అలాంటి నియోజకవర్గానికి రమేష్ బిధూరిని ఇన్చార్జిని చేయడం ద్వారా బిజెపి వారు దేశానికి స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. తమకు ముస్లింల ఓట్లు అవసరం లేదని, వారికి వ్యతిరేకంగా హిందువులంతా సమైక్యమై తమకు మద్దతు ఇస్తే చాలని బిజెపి వారు చెప్పకనే చెప్పారు.

ఎన్నికలు సమీపించిన కాలంలో అందరూ అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు. పథకాలు ప్రకటిస్తారు. కానీ దేశంలో మైనారిటీల మీద విషం గక్కిన వ్యక్తిని ఒక నియోజకవర్గానికి ఎన్నికల ఇన్చార్జిగా ప్రకటించడం ద్వారా మొత్తం దేశమంతా తాము అనుసరిస్తున్న విధానం ఏమిటో, ఎవరికి వ్యతిరేకంగా ఎవరిని తాము నిలబెట్టాలనుకుంటున్నారో ఇప్పుడు ఈ చర్య ద్వారా బిజెపి తన అంతరంగాన్ని వ్యక్తం చేసింది. అందుకే బీజేపీ తాను చెప్పదలుచుకున్నది ఏమిటో స్పష్టంగా చెబుతున్నది. చేయదలుచుకున్నది ఏమిటో స్పష్టంగా చేస్తున్నది. అర్థం కావాల్సింది దేశానికే. తమ విధానమే మైనారిటీ వ్యతిరేక విధానమని, హిందూ మెజారిటీ ఆధిపత్య స్థాపనే తమ విధానమని, ఇందులో ఎలాంటి దాపరికం లేదని, ఇంకా ఎవరికైనా సందేహం ఈ విషయంలో ఉంటే వారు ఇకనైనా బిజెపి అసలు రూపాన్ని అర్థం చేసుకుంటారని ఈ తాజా నిర్ణయం ద్వారా బిజెపి దేశమంతా తిరిగి చెప్పిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

Read Also : Congress : మొండిచేయికి ఓటేస్తే 3 గంట‌ల క‌రెంట్ గ్యారెంటీ, ఏడాదికో సీఎం – కేటీఆర్