Site icon HashtagU Telugu

Rama Temple Vs Rahul Gandhi Yatra : రామ మందిరం Vs రాహుల్ యాత్ర

Rama Temple Vs Rahul Gandhi Yatra

Rama Temple Vs Rahul Gandhi Yatra

By: డా. ప్రసాదమూర్తి

జనవరి 22వ తేదీన నూతన రామ మందిర (Rama Temple) మహావిష్కరణ మహోత్సవానికి అన్ని రాజకీయ సన్నాహాలూ సాగుతున్నాయి. రాజ్యాంగం ఏం చెప్పినా, న్యాయస్థానాలు ఏం చెప్పినా అధికార బిజెపి వారికి తాము చేసేదే రాజ్యాంగం.. తాము చెప్పేదే న్యాయం. ప్రస్తుత రామ మందిర (Rama Temple) ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా రానున్న సార్వత్రిక ఎన్నికలకు రాజకీయ ప్రచారంగా వారు మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు ఒకపక్క విపక్షాలు దుయ్యబడుతున్నాయి. విమర్శించడం మాత్రమే కాదు దేవుడితో ముడిపెట్టబడి ఉన్న, మతంతో మమేకమై ఉన్న రామ మందిరం (Rama Temple) ప్రారంభోత్సవ రాజకీయాన్ని విపక్షాలు ఎలా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయో ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయంలో ప్రతిపక్షాలు కొంత అయోమయంలో పడ్డాయి.

We’re now on WhatsApp. Click to Join.

అయితే దీన్ని బలంగా ఎదుర్కోవాలంటే మరో బలమైన ఎజెండా కావాలని కాంగ్రెస్ పార్టీ మాత్రం రాహుల్ గాంధీని మరో యాత్రకు సిద్ధం చేసింది. అదే జనవరి 14వ తేదీన రాహుల్ ప్రారంభించబోయే భారత న్యాయ యాత్ర. ఇంతకుముందు నఫ్రత్ కే బాజార్ మే హమ్ మొహబ్బత్ కే దుకాన్ ఖోలేంగే అంటూ విద్వేష బజారులో తాము ప్రేమ దుకాణాన్ని తెరుస్తామని రాహుల్ గాంధీ వేల కిలోమీటర్లు దేశమంతా తిరిగి ప్రజలను కలిసి అఖండంగా తన యాత్ర సాగించారు. మతం పేరుతో మైనారిటీ వర్గాలకు మెజారిటీ వర్గాలకు మధ్య విద్వేషాన్ని రగిలించి, తమ రాజకీయ ప్రయోజనాలు కాపాడుకునే వారు దేశాన్ని పరిపాలిస్తున్నారని, దేశ సమైక్యత, సమగ్రత, అఖండత కాపాడుకోవడానికి దేశాన్ని ఒక తాటిపైకి తీసుకురావడం అవసరమని రాహుల్ గాంధీ ఆనాడు భారత్ జోడో యాత్ర చేశారు. ఇప్పుడు రామ మందిర రాజకీయాలని ఎదుర్కోవడానికి మరో యాత్రకు పూనుకున్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి వారు సాగిస్తున్న విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా గతంలో భారత్ జోడో యాత్ర చేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రాజకీయ ఆర్థిక సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ ఈ యాత్రను చేపట్టనున్నారు. రెండు నెలల పాటు మణిపూర్ నుంచి ముంబై వరకు 6,200 కిలోమీటర్లు ఈ యాత్ర ఆయన సాగిస్తారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో మొదలుపెట్టి ముంబైలో ఈ యాత్ర ముగుస్తుంది. తూర్పు నుంచి పశ్చిమ దిశగా సాగే ఈ యాత్ర 14 రాష్ట్రాలను కవర్ చేస్తుంది. మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గడ్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర- ఈ రాష్ట్రాలలో రాహుల్ గాంధీ ఇప్పుడు న్యాయం కోసం భారత్ యాత్ర చేపడుతున్నారు. మే మూడో తేదీన మొదలైన జాతుల విధ్వంసం మణిపూర్లో ఇప్పటికీ చల్లారలేదు. దాదాపు రెండు వందల మంది చనిపోయారు.

Also Read:  Priyanka Gandhi : మనీలాండరింగ్ కేసులో ప్రియాంక గాంధీ పేరు

60 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇలాంటి సమస్యల పట్ల న్యాయం కావాలని రాహుల్ డిమాండ్ చేయబోతున్నారు. అలాగే దేశంలో విపరీతంగా పెరిగిపోయిన నిరుద్యోగంతో యువత నిష్పృహ నిరాశలకు గురై ఉంది. వారికి న్యాయం జరగాలి. రైతుల ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతున్నాయి. వారికి న్యాయం జరగాలి. మహిళలకు న్యాయం జరగాలి. కింది కులాలకు చెందిన ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం జరగాలి. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతుంది. ఆర్థికమైన అసమానతలు నానాటికీ నింగిని తాకుతున్నాయి. ఇలా అనేక రంగాలలో అనేక విషయాలలో అన్యాయానికి గురైన ప్రజల గొంతుకగా రాహుల్ ఈ యాత్రను చేపట్టనున్నారు. రాజ్యాంగ భూమికలో చెప్పిన స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం అనే మూడు అంశాల ప్రాతిపదిక మీద భారత జోడో యాత్ర రాహుల్ సాగించారని, ఇప్పుడు అదే రాజ్యాంగంలోని అతి మౌలిక సూత్రమైన ‘న్యాయం’ అనే అంశాన్ని పునాదిగా చేసి భారత న్యాయ యాత్ర సాగుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు.

యాత్రకు కారణాలు ఏం చెప్పినా, మనకు కనిపిస్తున్న కారణం ఒకటే. అది రామ మందిరం మహావిష్కరణను బిజెపి తమ స్వార్థ రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకుంటుందని, దాన్ని ఎదుర్కోవడానికి రాహుల్ ఇప్పుడు ఈ యాత్రను ప్రారంభిస్తున్నట్లు అందరూ అనుకుంటున్నారు. తాము సమస్యల గురించి పోరాడుతున్నామని, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అధినాయకులు రామ మందిరం అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. రామ మందిరం దేశంలోని కోట్లాది హిందూ భక్తుల విశ్వాసాలతో ముడిపెట్టబడి ఉంది. అందుకే రామ మందిరం ప్రజల హృదయాలను సులభంగా గెలుచుకోగలదని బిజెపి వారి నమ్మకం. ప్రజల భక్తి విశ్వాసాలను మతం వరకే పరిమితం చేసి, దేశ సమస్యల వైపు ప్రజలను మళ్లించాలని కాంగ్రెస్ చూస్తోంది. ఈ రెండు ప్రయత్నాల్లో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాల్సిందే.

Also Read:  Bhatti: తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్‌ కార్డు ఇవ్వలేదు : డిప్యూటీ సీఎం భట్టి

Exit mobile version