Site icon HashtagU Telugu

Rama in Political Shrine : రాజకీయ మందిరంలో రాముడు

Ayodhya Parking

Ayodhya From High Spirituality To Digital Flourishing

By:  డా. ప్రసాదమూర్తి

భవభూతి అనే మహాకవి చాలా కాలం క్రితం ఉత్తర రామ చరిత్ర అనే ఒక గొప్ప నాటకాన్ని రాశాడు. అందులో రాముడు (Rama) ప్రజల పట్ల తనకున్న నిబద్ధత, ప్రేమ, అనురాగం గురించి చెప్పిన ఒక శ్లోకాన్ని చాలామంది పదేపదే తలుచుకుంటారు. “ స్నేహం దయాంచ సౌఖ్యం చ” అనే ఆ శ్లోకానికి అర్థం, ప్రజా సంక్షేమం కోసం ప్రజలను ఆరాధించడం కోసం తాను స్నేహాన్ని దయను సౌఖ్యాన్ని ఆఖరికి తన ప్రాణానికి ప్రాణమైన సీతాదేవిని కూడా విడిచి పెట్టేయగలనని, అందుకు తనకు ఎలాంటి బాధా ఉండదని రాముడు (Rama) చెప్పాడు. రాముడంటే లోకారాధన, ప్రజారాధన కోసం దేన్నైనా త్యాగం చేసే లోకోత్తర పురుషుడని ఈ శ్లోకం ద్వారా మనకు అర్థమవుతుంది. ఇప్పుడిదంతా ఎందుకంటే, మర్యాద పురుషోత్తముడుగా కోట్లాది హిందువులు కొలుచుకునే శ్రీరాముడు (Sri Rama) రాజకీయాలకు కేంద్రబిందువైపోయాడు.

We’re now on WhatsApp. Click to Join.

దశాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్యలో బాబ్రీ మసీదు రామ జన్మభూమి వివాదం అత్యున్నత న్యాయస్థానం ద్వారా పరిష్కృతమయ్యాక, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రామ మందిర నిర్మాణాన్ని చేపట్టింది. ఈ మందిర నిర్మాణం శంకుస్థాపన మహోత్సవమే మొత్తం దేశమంతా పండగలా జరుపుకునే పుణ్యకాండగా నిర్వహించిన విషయం మనకు తెలుసు. ఇప్పుడు అదే రామ మందిర నిర్మాణం పూర్తయి జనవరి 22వ తేదీన ప్రారంభ మహోత్సవానికి సిద్ధమయింది. శంకుస్థాపనే ఆ రేంజ్ లో ఉంటే, ఇక ఆ మందిర ప్రారంభ సంరంభం ఎలా ఉంటుందో మనం ఊహించుకోగలం. ఇప్పటికే హడావిడి ప్రారంభమైంది. మరో నాలుగైదు నెలల్లో దేశ సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. విపక్ష పార్టీలతో పాటు అందరూ ఊహించినట్టుగానే ఈ రామ మందిరం ఘటన ఒక రాజకీయ మహాఘటనగా మారుతున్నట్టు అర్థమవుతుంది.

భక్తుల గుండెల్లో కొలువుండే దేవుడు గుడి కోసం భక్తుల్ని ప్రార్థిస్తాడా అంటే, అలాంటి ప్రశ్న వేసే వాళ్ళని నాస్తికులుగానో, ఇంకా ముందుకు పోయి దేశద్రోహులుగానో కూడా ముద్ర వేసే ప్రమాదం ఉంది. కానీ మన దేశంలో బాబ్రీ మసీదు, రామ జన్మభూమి వివాదం చుట్టూ రాజకీయాలు అల్లుకున్నాయి. ఎవరి ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా కోర్టు నిర్ణయం ద్వారా రామ మందిర నిర్మాణం జరిగింది. ఇకనైనా రాముడి పట్ల చిత్తశుద్ధి భక్తిశ్రద్ధలు ఉన్నవారు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ మందిర నిర్మాణాన్ని ఉపయోగించుకోకూడదు. కానీ అది ఎవరికి చెప్తాం? అలా చెప్పిన వాళ్లే రాముణ్ణి వ్యతిరేకించే వాళ్ళుగా చత్రీకరించబడతారు. ఏది ఏమైనా ప్రజారాధన కోసం తాను సర్వస్వాన్ని త్యాగం చేస్తానన్న రాముడిలోని ఆ ఔన్నత్యాన్ని రాజకీయ మందిరంలో ప్రతిష్టించి ఆ గుడి చుట్టూ అందరూ రాజకీయ ప్రదక్షిణాలు చేయడమే గొప్ప విషాదం.

Also Read:  PM Modi: విజయకాంత్‌ మరణం పట్ల మోడీ సంతాపం

జనవరి 22వ తేదీన రామ మందిరం ఉద్ఘాటన మహోత్సవానికి ప్రాణ ప్రతిష్టాపన అని నామకరణం చేశారు. ఆ కార్యక్రమం 15వ తేదీ నుండి రకరకాల దశల్లో కొనసాగుతుంది. ఈ మహోత్సవానికి యజమానిగా ప్రధాని నరేంద్ర మోడీ ఉంటారట. అంటే యజ్ఞ యాగాల సందర్భంగా వాటిని నిర్వహించే వారిని యజమాని అంటారు. మన భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎలాంటి మతపరమైన కార్యక్రమంలోనూ ప్రభుత్వ హోదాలో పాల్గొనకూడదు అని ఇప్పుడు పెద్దలు కొందరు ఉటంకిస్తున్నారు. ఈ ఉత్సవానికి దేశంలో మత పెద్దలు, వివిధ వర్గాల ప్రముఖులతోపాటు ప్రతిపక్ష నాయకులను కూడా ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని అందుకున్న సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రధాని ఇలాంటి మతపరమైన కార్యక్రమంలో పాల్గొనడం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. అలాగే మమతా బెనర్జీ, సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే మొదలైన ప్రతిపక్ష నాయకులందరినీ ఈ ఉత్సవానికి పిలిచారు. ఇక్కడ ప్రతిపక్ష నాయకులకు ఒక సమస్య ఎదురయింది.

రామ మందిరంపై హక్కు కేవలం బిజెపి వారికి, ఆర్ఎస్ఎస్ వారికి మాత్రమే ఉన్నట్టు, వారు చేపట్టిన ఈ మహత్కార్యం దేశంలోని సమస్త హిందూ జనాభా హర్షోల్లాసానికి సంబంధించిన దైవ కార్యక్రమంగా చాటి చాటి చెప్పే చాకచక్యమైన ప్రచారం ఈ రామ మందిరం ప్రారంభోత్సవం చుట్టూ అల్లుకొని ఉంది. దీనికి వెళితే రామ మందిర రాజకీయంలో తాము ఇరుక్కుపోతామని, వెళ్లకపోతే ఈ నాయకులంతా హిందూ వ్యతిరేకులని అధికార పార్టీ వారు మరో ప్రచారం చేసే అవకాశం ఉంది. అందుకే ప్రతిపక్షాలకు అటు చూస్తే రామమందిరం.. ఇటు చూస్తే రాజకీయం, ఎటూ పాలుపోని పరిస్థితి ఎదురయింది. ఏది ఏమైనా రాముడుండాడు, రాజ్యముండాది అన్నట్టు ఇక్కడ అంతా ఏం జరిగినా రాముడు చుట్టూనే జరుగుతుంది. కానీ రాముడు ఉంటే అన్నీ చూస్తూనే ఉంటాడు. తన పట్ల నిజమైన భక్తులు ఎవరు? లేదా స్వామి కార్యం పేరు మీద స్వకార్యం కోసం పాకులాడుతున్నది ఎవరు అనేది తప్పక గమనిస్తాడు.

సర్వాంతర్యామికి రాజకీయ నాయకుల ఆంతర్యం బోధపడదా? కానీ ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు. ప్రస్తుతం జనవరి 22వ తేదీన జరగబోతున్న రామ మందిర ఆవిష్కరణే ప్రధానం. దీన్ని అధికార పార్టీ ఏ విధంగా రానున్న ఎన్నికల్లో వినియోగించుకుంటుందో, మతంతో ముడి పెట్టిన ఈ రాజకీయాన్ని విపక్షాలు ఎలా ఎదుర్కొంటాయో చూడాలి.

Also Read:  AP Congress : ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకే.. నేడో.. రేపో అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్న ఏఐసీసీ..?

Exit mobile version