Reliance Industries : జనవరి 22న అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనున్న తరుణంలో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక ప్రకటన చేసింది. రామమందిరంలో రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించే రోజున(సోమవారం) దేశమంతటా పనిచేస్తున్న తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. అందరూ రామమందిర కార్యక్రమాన్ని కనులారా తిలకించేందుకు ఈ సెలవు ఇస్తున్నామని వెల్లడించింది. రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు సంబంధించిన ఆహ్వానం అందుకున్న ప్రముఖుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ(Reliance Industries), ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. అంబానీ, అదానీ లాంటి ప్రముఖులకు వసతి కల్పించేందుకు అయోధ్యలో ప్రత్యేకమైన వసతులతో టెంట్ సిటీని నిర్మించారు. ఇందులో భద్రతకు,పరిశుభ్రతకు పెద్దపీట వేశారు.
We’re now on WhatsApp. Click to Join.
మరోవైపు మోడీ ప్రభుత్వం కూడా జనవరి 22న కేంద్ర సర్కారు ఉద్యోగులకు సగం రోజు (మధ్యాహ్నం 2.30 గంటల వరకు) సెలవుదినాన్ని అనౌన్స్ చేసింది. ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, గోవా, మహారాష్ట్ర ప్రభుత్వాలు సోమవారం రోజు పూర్తి సెలవు ప్రకటించాయి. గుజరాత్, రాజస్థాన్, త్రిపుర, ఛత్తీస్‌గఢ్, అస్సాం, ఒడిశాలు ఉద్యోగులకు సగం రోజు లీవ్‌ను ఇస్తామని వెల్లడించాయి. అయోధ్య రామమందిరం గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమం సోమవారం రోజు మధ్యాహ్నం 12:20 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతుంది. 51 అంగుళాల ఎత్తున్న బాలరాముడి విగ్రహాన్ని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు. గురువారం మధ్యాహ్నమే ఆలయ గర్భగుడిలో బాలరాముడిని ప్రతిష్ఠించారు. విగ్రహంపై కప్పి ఉంచిన వస్త్రాన్ని శుక్రవారం మధ్యాహ్నం తొలగించారు. దీంతో భగవాన్ శ్రీరాముడి దివ్యరూపాన్ని చూసే అవకాశం అందరికీ.. ప్రాణప్రతిష్ఠా మహోత్సవం కంటే ముందే లభించింది.
Also Read: HMDA : హైదరాబాద్‌లో ‘రియల్’ బూమ్ కోసం ఏం చేయబోతున్నారంటే..
స్టాక్ ఎక్స్ఛేంజీలతో పాటు స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కూడా స్టాక్ ఎక్స్ఛేంజీలను మూసివేయాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ఓ పత్రికా ప్రకటన విడుదల చేస్తూ.. జనవరి 22వ తేదీని చారిత్రాత్మకమైన రోజును చూసేందుకు యావత్ దేశమంతా ఉత్సుకతతో ఉందని పేర్కొన్నారు. షేర్లలో ట్రేడింగ్ చేసే వారు జనవరి 22, సోమవారం రామ్‌లల్లా ప్రాణ్ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించడానికి, వేడుకలో గొప్ప వైభవంగా ప్రదర్శనతో పాల్గొనడానికి వీలుగా సోమవారం స్టాక్ మార్కెట్‌ను మూసివేయాలని నిర్ణయించబడింది. నేడు జనవరి 20, 2024న స్టాక్ మార్కెట్‌లో కొంత సమయంపాటు రెండు దశల్లో షేర్ల ట్రేడింగ్ జరుగుతుంది.