Congress Politics: రాజస్థాన్ కాంగ్రెస్ లో 35 ఏళ్ల కిందటి సీన్ రిపీట్.. “సరిస్కా టైగర్ జోక్”పై మళ్లీ చర్చ!!

రాజస్థాన్ కాంగ్రెస్ సంక్షోభం ఇప్పుడు ఢిల్లీ దర్బార్ కు చేరింది.

  • Written By:
  • Updated On - September 28, 2022 / 10:13 AM IST

రాజస్థాన్ కాంగ్రెస్ సంక్షోభం ఇప్పుడు ఢిల్లీ దర్బార్ కు చేరింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సీనియర్ నేత సచిన్ పైలట్మధ్య సయోధ్య కుదిర్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్  జాతీయ అధ్యక్ష పగ్గాలు దక్కితే రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకునేలా అశోక్ గెహ్లాట్ పై ఒత్తిడి పెంచాలని సచిన్ పైలట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అశోక్ గెహ్లాట్ మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నారు. కాంగ్రెస్ చీఫ్ పీఠం దక్కినా.. రాజస్థాన్ సీఎం పదవిని వదలొద్దని అశోక్ గెహ్లాట్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి రాజకీయ ట్విస్ట్ లు రాజస్థాన్ కు కొత్తేమీ కాదు. 35 ఏళ్ల క్రితం 1988 సంవత్సరంలోనూ అచ్చం ఇదే విధమైన రాజకీయ పరిణామాలను రాజస్థాన్ చవిచూసింది.

1980వ దశకంలో..

అప్పట్లో రాజస్థాన్ ముఖ్యమంత్రి గా కాంగ్రెస్ సీనియర్ నేత హరిదేవ్ జోషి ఉన్నారు. ఆ సమయంలో యువకుడైన అశోక్ గెహ్లాట్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పదవిలో ఉన్నారు. అంటే ఇప్పటి సచిన్ పైలట్ స్థానంలో .. అప్పట్లో అశోక్ గెహ్లాట్ ఉన్నారు. 1984 -85 సంవత్సరంలో రాజీవ్ గాంధీ క్రేజ్ తో రాజస్థాన్ లో కాంగ్రెస్ బంపర్ మెజారిటీతో గెలిచింది. ఈ ఊపులో రాజస్థాన్ నేపథ్యం లేని కాంగ్రెస్ సీనియర్ లీడర్లను (రాజేష్ పైలట్, సర్దార్ బూట సింగ్, బలరామ్ ఝకర్, ఇంకొందరు) కూడా రాజస్థాన్ నుంచి రాజ్యసభ కు ఎంపిక చేశారు. ఇదే పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది. ప్రస్తుతం కూడా రాజస్థాన్ నేపథ్యం లేని కాంగ్రెస్ సీనియర్లు మన్మోహన్ సింగ్, రణ్ దీప్ సింగ్ సూర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీ, కేసీ వేణు గోపాల్ కూడా రాజస్థాన్ నుంచే రాజ్యసభలో ఉన్నారు.

కరువు కాలంలో రాజస్థాన్ లోకి రాజీవ్ ..

1986 -87 మధ్య కాలంలో రాజస్థాన్ లో తీవ్ర కరువు వచ్చింది.
ఈనేపథ్యంలో 1988 జనవరిలో నాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ రాజస్థాన్ లోని సరిస్కా నేషనల్ పార్క్ లో కేంద్ర క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. ఆ సమయంలో రాజస్థాన్ బ్యూరోక్రటిక్ వర్గాల్లో ఒక మాట పై తీవ్ర ప్రచారం జరిగింది. ” తినే విషయానికి వస్తే .. నేను సీఎంలనే ఎక్కువగా ఇష్టపడతాను. వారు చాలా సోమరులు. బాగా తిని బలిసినోళ్లు” అని సరిస్కా నేషనల్ పార్క్ లోని టైగర్ చెబుతోంది అని అప్పట్లో వ్యంగ్య వ్యాఖ్యానాలు చేశారు. ఈ వ్యాఖ్యల్లో అన్నట్టుగానే సరిస్కా నేషనల్ పార్క్ లో మీటింగ్ తర్వాత రాజీవ్ గాంధీ సంచలన నిర్ణయం ప్రకటించారు.

సీఎం డుమ్మా.. రాజీవ్ ఆగ్రహం.. పీవీ రాయబారం

కేంద్ర క్యాబినెట్ మీటింగ్ కు డుమ్మా కొట్టిన నాటి రాజస్థాన్ ముఖ్యమంత్రి హరిదేవ్ జోషికి రాజీవ్ గాంధీ చెక్ పెట్టారు. ఆయనకు 87 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికినా వదల్లేదు. కేవలం 25 మంది ఎమ్మెల్యేల మద్దతు కలిగిన అశోక్ గెహ్లాట్, శివ్ చరణ్ మాధుర్ గ్రూప్ వైపు రాజీవ్ మొగ్గు చూపారు. పార్టీ విధేయుడు శివ్ చరణ్ మాధుర్ ను సీఎం గా ప్రకటించారు. నాటి ముఖ్యమంత్రి హరిదేవ్ జోషిని అస్సాం గవర్నర్ గా పంపించారు. ఇది వెంటనే జరిగిపోలేదు. రాజీవ్ గాంధీ తరఫున శాంతిదూతగా పీవీ నరసింహారావు నెల రోజుల పాటు రాజస్థాన్ లో ఉండి సయోధ్య కుదిరేలా చేశారు. అస్సాం గవర్నర్ గా వెళ్లేలా ముఖ్యమంత్రి హరిదేవ్ జోషిని ఒప్పించారు. దీంతో కథ సుఖాంతం అయింది. ఈసారి రాజస్థాన్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.