Honeymoon Murder Case : దేశవ్యాప్తంగా దుమారం రేపిన రాజా రఘువంశీ హత్య కేసులో మరో కీలక విషయం బయటపడింది. రాజాను హత్య చేసిన సమయంలో అతడి భార్య సోనమ్ రఘువంశీ అక్కడే ఉన్నప్పటికీ, భర్తపై హంతకులు దాడి చేస్తుండగానే అక్కడి నుంచి పారిపోయిందని తాజా దర్యాప్తులో పోలీసులు తేల్చారు. రాజా చనిపోయిన తరువాతే ఆమె మళ్లీ ఆ ప్రాంతానికి వచ్చిందని స్పష్టమైంది.
ఈ కేసును పరిశీలిస్తున్న సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) అధికారులు నిన్న సోనమ్ సహా మిగతా నిందితులను షిల్లాంగ్‌కు 65 కిలోమీటర్ల దూరంలోని సోహ్రా ప్రాంతానికి తీసుకెళ్లి క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. అంటే హత్య జరిగిన తీరు ఎలా ఉండొచ్చని పునర్నిర్మించారు. ఇందులోని వివరాలు ఇంకా షాకింగ్‌గా ఉన్నాయి.
పోలీసుల కథనం ప్రకారం, విశాల్ సింగ్ చౌహాన్ అనే కిరాయి హంతకుడు రాజాపై వేటకొడవలితో తొలిదెబ్బ కొట్టాడు. ఆ దెబ్బతో రాజాకు గాయాలై తీవ్ర రక్తస్రావం కావడంతో పాటు కేకలు వేయడంతో సోనమ్ అక్కడినుంచి తక్షణమే పారిపోయిందట. అప్పటి దాకా సోనమ్ అక్కడే ఉందని పోలీసులు తేల్చారు.
ఈ క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో మరో కీలక అంశం బయటపడింది. ఇప్పటి వరకు హత్యలో ఒకే వేటకొడవలిని ఉపయోగించారని భావించగా, ఇప్పుడు రెండో వేటకొడవలిని కూడా పోలీసులు వెతికిచూశారు. ఈ రెండో ఆయుధాన్ని రాజా మృతదేహం దొరికిన వెయ్ సావ్‌డాంగ్ పార్కింగ్ లాట్ కింద ఉన్న లోయలో నుంచి స్వాధీనం చేసుకున్నారు. అంటే హత్య రెండు ఆయుధాలతో జరిగిందని ఇప్పుడు స్పష్టమైంది.
ఇక ఈ దారుణ ఘటనపై సోనమ్ సోదరుడు గోవింద్ స్పందిస్తూ, “సోనమ్‌కి మా కుటుంబంతో ఇకపై ఎలాంటి సంబంధం లేదు,” అంటూ ప్రకటించారు. రాజా కుటుంబానికి న్యాయం జరగాలన్న పోరాటానికి తాము మద్దతుగా ఉంటామని తెలిపారు. ఈ ఘటన తమ కుటుంబాన్ని తీవ్రంగా కుదిపేసిందని వ్యాఖ్యానించారు.