Raj Thackeray : మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్’ మూవీని మహారాష్ట్రలో విడుదల చేయొద్దని ఆయన హెచ్చరించారు. ఒకవేళ మూవీ విడుదలకు అనుమతిస్తే తాము థియేటర్ల యజమానులను వదలబోమని అల్టిమేటం ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్’ అక్టోబర్ 2న మన దేశంలో రిలీజ్ కానున్న తరుణంలో రాజ్‌థాక్రే (Raj Thackeray) చేసిన వ్యాఖ్యలతో కలకలం రేగింది.
Also Read :Manish Sisodia : పార్టీ మారకుంటే చంపేస్తామన్నారు.. మనీశ్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు
‘‘ఆ పాకిస్తాన్ నటుడి సినిమాను మహారాష్ట్రలో రిలీజ్ చేయడానికి మా పార్టీ ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించదు. పాకిస్తానీ హీరోల మూవీలను భారత్‌లో ఎందుకు అనుమతిస్తున్నారు?’’ అని రాజ్‌థాక్రే ప్రశ్నించారు. ‘‘కళకు సరిహద్దులు లేవు. కానీ భారత్‌లో పనిచేస్తున్న పాకిస్తానీ నటులకు ఆ నియమం వర్తించదు’’ అని ఆయన తేల్చి చెప్పారు. ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్’ మూవీని యావత్ దేశంలోనూ విడుదల కాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇంతకుముందు తమ మాట వినకుండా ఇలాంటి సినిమాలు విడుదల చేసినప్పుడు ఏమైందో అందరికీ తెలుసని రాజ్ థాక్రే గుర్తు చేశారు. తమ మాటను థియేటర్ యజమానులు వినాలని.. వినకుండా ముందుకు వెళితే కష్టాల పాలు కావాల్సి వస్తుందని హితవు పలికారు. నవరాత్రి ఉత్సవాలు సమీపించిన ప్రస్తుత తరుణంలో మహారాష్ట్రలో వివాదాలు జరగకూడదని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు.కాగా, ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్’ మూవీ 2022 సంవత్సరంలోనే పాకిస్తాన్‌లో రిలీజై సక్సెస్ అయింది. ఇప్పుడు దాన్ని భారత్‌లో విడుదల చేస్తున్నారు. ఇక సినిమాల విషయంలో ఇలాంటి వార్నింగ్‌లను రాజకీయ పార్టీలు ఇవ్వడం సరికాదనే అభిప్రాయం సినీ పరిశ్రమ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.