PM Modi : మోడీ పై పూల వర్షం.. ఎందుకీ హర్షం?

నరేంద్ర మోడీ (Modi) ఏం చేసినా అదొక విశ్వకళ్యాణమే. పార్లమెంటు భవన ప్రారంభోత్సవ పటాటోపం కావచ్చు, విదేశీ పర్యటనా వీరోచిత కార్యం కావచ్చు

  • Written By:
  • Updated On - September 14, 2023 / 12:54 PM IST

By: డా. ప్రసాదమూర్తి

Prime Minister Narendra Modi : జీ 20 పండగ అలా ముగిసిందో లేదో ఆ పండుగను పార్టీ పండగలా మార్చుకోవడానికి బిజెపి నాయకత్వం నడుం బిగించింది. ఇది పండగా..? 4 వేల కోట్ల పైచిలుకు ధనాన్ని వాననీటి పాలు చేసిన వృధా ఖర్చు అని, అది పండుగ కాదు దండగ అని ప్రతిపక్షాలు మరోవైపు దండయాత్ర మొదలెట్టిన ఈ సమయంలో బిజెపి వారు దాన్ని తిప్పి కొట్టడానికి సకల సన్నాహాలు ప్రారంభించారు. దీనికి బుధవారం రాజధానిలో బిజెపి కేంద్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీని (Narendra Modi) ఆకాశానికి ఎత్తడం కోసం నిర్వహించిన సభ పరమోదాహరణగా చూపించాలి. నరేంద్ర మోడీ ఏం చేసినా అదొక విశ్వకళ్యాణమే. పార్లమెంటు భవన ప్రారంభోత్సవ పటాటోపం కావచ్చు, విదేశీ పర్యటనా వీరోచిత కార్యం కావచ్చు, జీ20 శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షత వహించిన అమృతావకాశం కావచ్చు, ఆయన ఏం చేసినా.. ఎక్కడ అడుగు మోపినా.. అదొక చరిత్రాత్మక సన్నివేశమే అన్నట్టు బిజెపి నాయకులంతా మోడీ సంకీర్తనా సమరంభంలో మునిగిపోతారు. పార్టీలో అపర హనుమంతుల్లాంటి అనుచర గణాన్ని నిర్మించుకోవడంలో ప్రధాని మోడీ (PM Modi) చూపిన రాజకీయ సృజనాత్మకత అనన్య సామాన్యమని చెప్పాలి.

జీ20, అంతకుముందు జీ7 ఇలా ఈ సమావేశాల గత చరిత్ర అంతా తడిమితే, ఎక్కడ ఏ దేశం ఏ రాజ్యం ఏ ప్రాంతం ఆర్థిక స్వావలంబనం కోసం ఈ కూటమిలోని దేశాలన్నీ కలిసికట్టుగా ఆర్థిక వ్యూహాలు రచించాయో మనకు ఒక ఉదాహరణ కూడా కనపడదు. ఇప్పటికే జీ20 సమావేశాలు ఏర్పాటుకు, నిర్వహణకు భారతదేశం పెట్టిన ఖర్చు అంచనా వేసిన 990 కోట్లు దాటి 4వేల కోట్లు పై చిలుకు అయిందని, అటు మీడియా, ఇటు ప్రతిపక్షాలు, మరోపక్క దేశమంతా కోడై కూస్తున్నాయి. రష్యా, ఫ్రాన్స్, జర్మనీ లాంటి ఉద్దండ దేశాలే వందల కోట్లలో ఈ సమావేశాలకు ఖర్చు చేసి చేతులు దులుపుకుంటే, మనం వేల కోట్లు ఖర్చుపెట్టి ఏం సాధించామన్నది ప్రశ్నగా మిగిలింది. అయినా ఏలిన వారు విమర్శలకు సమాధానం చెప్పడం నామోషీగా భావిస్తారు కదా. వాళ్ళని అలా అరుచుకోనివ్వండి, మన పని ఏదో మనం కానిద్దాం అనే మహోన్నత తాత్విక ప్రదర్శనలో బిజెపి గణనాథులు ఆరితేరిన వారు.

అందుకే ఇప్పుడు జి20 సమావేశాలు ఎందుకు జరిగినా, వాటి ఉద్దేశం ఏమైనా, ఆశించిన లక్ష్యాలు నెరవేరినా నెరవేరకపోయినా బీజేపీ వారు మాత్రం ఆ సమావేశాల అట్టహాసాన్ని తమ పార్టీ అధినాయకుడు నరేంద్ర మోడీ (Narendra Modi) విజయ విలాసంగా మార్చి, దేశమంతా ప్రచారం చేసుకోవడానికి కాకలు తీరిన కసరత్తులు ప్రారంభించారు. ఇప్పటికే ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రచారం సాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వారు ఒకే దేశం.. ఒకే ఎన్నిక.. ఒకే నాయకుడు అన్నట్టుగా ప్రచారం మొదలుపెట్టే దిశగా సాగుతున్నారా అన్న అనుమానం బుధవారం తమ పార్టీ కార్యాలయంలో ప్రధాని మోడీ (PM Modi) పైన వారు కురిపించిన ప్రశంసల హర్షాతిరేకాలు చూస్తే కలుగుతోంది. 20 సమావేశాలు ముగిసిన అనంతరం ప్రధాని మోడీ ఠీవిగా నడుచుకుంటూ చేయి ఊపుకుంటూ స్వదేశీ విదేశీ మీడియాని ఏకహస్త పలకరింపుగా కదిలినప్పుడు భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు మిన్నుముట్టిన దృశ్యం గుర్తుకొస్తోంది.

పార్టీ కార్యాలయంలో తమ అధినేత కాలు మోపుతున్న సమయంలో ఆయనపై బిజెపి నాయకులందరూ కురిపించిన పూలవాన, ఆకాశం కుండపోతగా పూల వర్షం కురిసిందా అన్నంత హంగామా కనిపించింది. అంతేకాదు వారు ఈ సమావేశం సందర్భంగా నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తివేస్తూ తీర్మానం చేశారు. మొత్తం ప్రపంచ నిర్మాణాన్ని తారుమారు చేస్తున్న మహా నాయకుడిగా మోడీ పై వారి పొగడ్తలు శిఖరాలకు చేరాయి. రెండు పేజీల తీర్మానంలో మోడీ అధ్యక్షతన మనదేశంలో జరిగిన జి20 శిఖరాగ్ర సమావేశం భారత దౌత్య చరిత్రలోనే ఒక శిఖరాయమాన అధ్యాయంగా నిలిచిపోతుందని ప్రశంసించారు. బిజెపి ప్రముఖులు జేపీ నడ్డా, అమిత్ షా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో, నరేంద్ర మోడీ మరో అవతార పురుషుడా అన్నట్టు వీరంతా ఏకబిగిన కీర్తి శ్లోకాలు వల్లించారు.

చూశారా అదీ నరేంద్ర మోడీ రాజకీయ సృజనాత్మక చాతుర్యం అంటే. ప్రతిపక్షాలు విమర్శించడానికి ఉంటాయి. మీడియాలో మిగిలిన ఒకటీ అరా శాతం వ్యతిరేక శక్తులు రంధ్రాన్వేషణ చేస్తూనే ఉంటాయి. మనం మాత్రం పూచిక పుల్లంత పనిచేసినా ఆకాశమంత హడావుడి చేయాలన్నదే మోడీ గారు ఆయన అనుచరులకు బోధించిన పరమోపదేశం కావచ్చు. అందుకే ఈ హడావుడి అంతా. ఏది ఏమైనా గతం మాదిరి దేశం కళ్ళకు గంతలు కట్టి, భాజా భజంత్రీలతో స్వీయ భజనలో భక్తిపారవశ్యంతో గెంతులు వేయడానికి కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు. అటు ప్రపంచమూ, ఇటు దేశమూ అంతా చూస్తూనే ఉన్నారు. మరి సొంత భజన కొంతైనా తగ్గించుకొని, దేశం కోసం మనం ఏం చేస్తున్నామని చెప్పుకోవడానికి కాస్త సమయం అయినా కేటాయిస్తే ఏలిన వారికి దేశం రుణపడి ఉంటుంది.

Also Read:  Chandrababu Arrest : ఇక సైకిల్ నడిపేది బాలయ్యేనా..?