Bullet Train : దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుగా నిలిచిన అహ్మదాబాద్-ముంబయి హైస్పీడ్ రైలు మార్గం కీలక దశను అధిగమించింది. ఇప్పటివరకు 300 కిలోమీటర్ల మేర వంతెన నిర్మాణం పూర్తయిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వీడియో రూపంలో పంచుకున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా భారత రైల్వే వ్యవస్థలో మరో విప్లవాత్మక మలుపు తిరుగనుంది. మొత్తం 508.17 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబడుతున్న ఈ కారిడార్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌నుండి మహారాష్ట్ర రాజధాని ముంబయి వరకు ప్రయాణాన్ని వేగవంతం చేయనుంది. పూర్తి స్థాయిలో సేవలు ప్రారంభమైన తర్వాత, ఈ బుల్లెట్ ట్రైన్ ద్వారా అహ్మదాబాద్ నుంచి ముంబయి కేవలం 2 గంటల 58 నిమిషాల్లో చేరుకోవచ్చు.
300 km viaduct completed.
— Bullet Train Project pic.twitter.com/dPP25lU2Gy— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) May 20, 2025
ఈ మార్గంలో గుజరాత్‌లో 8 స్టేషన్లు, మహారాష్ట్రలో 4 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో శరవేగంగా కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిని, వాణిజ్య కేంద్రంగా గుర్తింపు పొందిన అహ్మదాబాద్‌ను బుల్లెట్ రైలు ద్వారా కలుపుతూ కొత్త సామర్థ్యాలను అందించేందుకు ఈ ప్రాజెక్ట్ దోహదపడనుంది. అధికారుల ప్రకారం, ఈ ప్రాజెక్ట్‌లో తొలి ట్రయల్స్‌ను 2026లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్రయల్ రన్ సమయంలో బుల్లెట్ ట్రైన్ గంటకు 350 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయనుంది. ఇది విమానం టేకాఫ్ వేగానికి సమానంగా ఉంటుందన్నది అధికారుల అభిప్రాయం. అయితే, ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఈ రైలు గరిష్ఠంగా 320 కి.మీ. వేగంతో నడపనున్నట్లు వివరించారు.
ఈ భారీ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం సుమారు రూ.1.08 లక్షల కోట్లు. దీన్ని జపాన్ ప్రభుత్వ సహకారంతో జాపనీస్ టెక్నాలజీ ఆధారంగా నిర్మిస్తున్నారు. టర్న్‌కీ ఆధారంగా నిర్మాణం చేపడుతూ, హైస్పీడ్ రైలు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, దేశంలో ప్రయాణ మార్గాల రూపురేఖలే మారనున్నాయి. ప్రయాణ కాలాన్ని తగ్గించడమే కాక, ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు మరింత వేగవంతం కావడమేగాక పర్యావరణపరంగా కూడా ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంది. ఇలా, అహ్మదాబాద్-ముంబయి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ రోజురోజుకీ ముందుకు సాగుతూ, దేశ రవాణా రంగాన్ని ఆధునికత వైపు తీసుకెళ్తోంది.